నవ్యాంధ్ర కలను నీరు గార్చే బడ్జెట్‌‌

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నవ్యాంధ్ర కలను నీరు గార్చే బడ్జెట్‌‌లా ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. ఏపీ బడ్జెట్‌పై నిరాసక్తత కనిపించిందని పేర్కొన్నారు. కేంద్రం నిర్మించే పథకాలను రాష్ట్రం తమవి అని చెప్పుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, వచ్చే ఆదాయం వడ్డీ కట్టడానికి సరిపోయేలా లేదని స్పష్టం చేశారు. కులాల కార్పొరేషన్ల నిధులు, వాళ్లకు వెళ్ళటం లేదని,  పేరుకి మాత్రమే కార్పొరేషన్లు అని, అక్కడ టీ తాగేందుకు కూడా డబ్బులు లేవని తెలిపారు. కార్పొరేషన్లకు నిధులిచ్చే చిత్తశుద్ధి ఏపీ ప్రభుత్వానికి లేదని చెప్పారు. 
 
బడ్జెట్‌లో తప్పులు చూపెట్టారని అంటూ రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన బడ్జెట్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ వాటా ఎందుకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు నిధులేవని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌ను పార్టీ మేనిఫెస్టో లాగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈనెల 19న కడపలో ప్రభుత్వ నిర్లక్షానికి నిరసనగా బిజెపి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
కాగా, బడ్జెట్ పొంతన లేదని.. హాస్యాస్పదంగా  ఉందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.  బడ్జెట్ చిత్తు కాగితంలా ఉందని, అంచనాలకు మించి దాఖలాలు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.  ప్రభుత్వం ఏర్పాడ్డాక ఇప్పటి వరకు చేసిన అప్పులు లెక్కలు ఎందుకు పేర్కొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు లేవని… ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విస్మయం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు రాష్టానికి ఏమీ చేయలేదన్న వైసీపీ… రాష్ట్ర బడ్జెట్‌లో ఎం కేటాయించారో చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.