పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సోమవారం తీవ్ర గందరగోళం పరిస్థితులు తలెత్తడంతోపాటు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హింసను ఖండిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు.
గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. హింసకు సంబంధించిన పోస్టర్లు, ఫోటోలను బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ప్రదర్శించారు. వెల్లో బైఠాయించారు అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు వారికి దీటుగా బదులిచ్చారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
శాంతించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని గవర్నర్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో సభను హోరెత్తించారు. సభలో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో గవర్నర్ ప్రసంగించకుండానే వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన బయటకు వెళ్లే మార్గాన్ని టీఎంసీ సభ్యులు అడ్డుకున్నారు.
దీంతో మరింత గందరగోళం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గవర్నర్ వద్దకెళ్లి చేతులు జోడించి ప్రసంగించాల్సిందిగా అభ్యర్థించారు. గవర్నర్ కూడా చేతులు జోడించి నమస్కరించారు. ఇద్దరూ పరస్పరం నమస్కరించుకున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు జోక్యం చేసుకున్నారు. బయటకు వెళ్లొద్దంటూ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా నిరసన ఆపాలని గవర్నర్ కోరినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు.
మళ్లీ గవర్నర్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, తృణమూల్ ఎమ్మెల్యేలు ఆయనను వారించారు. చేసేది లేక నినాదాల హోరు కొనసాగుతుండగానే గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. మమత అభ్యర్థనతో వెనక్కి వచ్చిన గవర్నర్ ప్రసంగించడంతో గందరగోళానికి తెరపడింది. అయితే, గవర్నర్ తన ప్రసంగంలోని మొదటి చివరి వ్యాఖ్యాలను చదివి ఆ తర్వాత సభ నుంచి నిష్క్రమించారు.
అసెంబ్లీలో బీజేపీ సభ్యుల తీరు పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యవహార శైలి ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా ఉందన్నారు. బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలన్నదే వారి కుట్ర అని ధ్వజమెత్తారు.మున్సిపల్ ఎన్నికల్లో హింసాకాండపై మాత్రమే తాము నిరసన తెలిపామని, సభను అడ్డుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి చెప్పారు.

More Stories
ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి దేశం నుంచి పంపిస్తాం
బీఎంసీ ఎన్నికల్లో బిజెపి 150 సీట్ల వరకు పోటీ!
ఆత్మహత్యకు పాల్పడిన వైద్యురాలిపై ఓ ఎంపీ వేధింపులు!