ఎల్‌ఐసిలో వాటాల విక్రయం వాయిదా !

ప్రభుత్వ రంగంలోని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి)లో వాటాల విక్రయం వాయిదా పడనుందని తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌ పరిణామాలతో మార్కెట్లలో అస్థిరత నెలకొన్న నేపథ్యంలో ఎల్‌ఐసి ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)ను ప్రస్తుత మార్చిలో నిర్వహించడం వీలుకాదని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఓ అధికారి దృవీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపిఒకు పెట్టాలని కేంద్రం భావిస్తోందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారంలోగా రావొచ్చని తెలుస్తోంది. కాగా.. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎల్‌ఐసి వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి. రష్యా-ఉక్రెయిన్‌ పరిణామాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎల్‌ఐసిలో వాటాల విక్రయాన్ని మోదీ ప్రభుత్వం  వాయిదా వేసుకోక తప్పలేదని నిపుణులు భావిస్తున్నారు. 

ఈ ఐపిఒ ద్వారా ఎల్‌ఐసిలోని 5 శాతం వాటాలను మార్కెట్‌ శక్తులకు విక్రయించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 31.6 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా కేంద్రం కనీసం రూ.66 వేల కోట్లు తన ఖాజానాలో వేసుకోవాలని నిర్దేశించుకుంది. ఎల్‌ఐసి ఐపిఒలో ఇన్వెస్టర్ల ఆసక్తులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని దీపమ్‌ సెక్రటరీ తూహిన్‌ పాండే తెలిపారు.

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ పరిణామాలను కేంద్రం దగ్గరగా పరిశీలిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయమే కీలకం కానున్నది.