అధిక ద్రవ్యోల్బణ సమస్య అమెరికాను బెంబేలెత్తిస్తున్నది. ధరల పెరుగుదలపై ప్రజల్లో ఆసంతృప్తి రాజుకుంటుండడంతో అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం నాలుగు అంశాలతో కూడిన ఒక ప్రణాళికను ఆవిష్కరించారు. బైడెన్ తన తొలి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో దీని గురించి విపులీకరించారు.
అధిక ధరలను అదుపులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ఆయన చెప్పారు. దేశీయంగా వస్తువుల తయారీని ప్రోత్సహించడం, రోజువారీ వ్యయాలను తగ్గించడం, తక్కువ ధరలకు సరైన పోటీ వుండేలా చూడడం, కార్మికులకు మంచి వేతనాలు గల ఉద్యోగాల విషయంలో అడ్డంకులు, అవరోధాలను నిర్మూలించడం ఆ ప్రణాళిక సారాంశం.
మన ఆర్థిక వ్యవస్థ అంతా బాగున్నా, రికార్డు స్థాయిలో ఉపాధి అభివృద్ధి జరిగినా, అధిక వేతనాలు ఇచ్చినా చాలా కుటుంబాలు పెరుగుతున్న వ్యయాన్ని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాయని బైడెన్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా వ్యాపారస్తుల లాభాల మార్జిన్లు తగ్గిపోవడం, ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోవడంతో అభివృద్ది అవకాశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉపయోగించే వ్యక్తిగత వినిమయ వ్యయం (పిసిఇ) జనవరిలో వార్షికంగా 6.1శాతం పెరిగిందని వాణిజ్య విభాగం విడుదల చేసిన డేటా పేర్కొంది. గత నాలుగు దశాబ్దాల్లో అత్యంత వేగంగా పెరిగిన వార్షిక రేటు ఇదే.

More Stories
షట్డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు