`ఆపరేషన్ గంగ’ .. ఉక్రెయిన్ నుంచి 1400 మంది తరలింపు

`ఆపరేషన్ గంగ’ .. ఉక్రెయిన్ నుంచి 1400 మంది తరలింపు
యుద్ధంలో చిక్కుకున్న ఉక్రెయిన్ నుండి భారతీయులను స్వదేశంకు తీసుకు రావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన `ఆపరేషన్ గంగ’ కింద సోమవారం రాత్రి వరకు ఆరు విమానాలలో 1400 మంది భారతీయులను తీసుకు వచ్చారు. 
 
అక్కడ అస్థిర పరిస్థితులు కొనసాగుతూ ఉండడంతో  ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులను  స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది.  ఆరో విమానంలో 240 మంది భారత పౌరులు ఢిల్లీకి చేరారు. 
 
బుకారెస్ట్  నుంచి నాలుగు విమానాలు, హంగేరి నుంచి రెండు విమానాలు వచ్చాయని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 1,400 మంది భారత పౌరులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చామని చెప్పారు. మిగిలిన వారిని సాధ్యమైనంత త్వరగా భారత్ కు రప్పిస్తామని తెలిపారు.  
 
తాము సూచనలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 వేల మంది ఉక్రెయిన్  ను విడిచి వెళ్లారని పేర్కొన్నారు.   ఉక్రెయిన్ సరిహద్దుగా ఉన్న 4 దేశాలకు భారత ప్రతినిధులను పంపేందుకు నిర్ణయించామని తెలిపారు. 
 
కేంద్రమంత్రులు జోతిరాధిత్య సింధియా రొమేనియాకు, కిరణ్ రిరీజు స్లోవాక్ రిపబ్లిక్ కు, హర్ దీప్ పురి హంగేరికి, పోలాండ్ కు వీకే సింగ్ వెళ్తారని చెప్పారు.  ఉక్రెయిన్  సరిహద్దులకు చేరుకునే భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యతను కేంద్రప్రభుత్వం వీరికి అప్పగించిందన్నాని వివరించారు. 

పాస్‌పోర్టులు లేని భారతీయులకు సర్టిఫికెట్లు 

ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి, వివిధ కారణాలతో పాస్‌పోర్టు లేకపోయిన భారతీయులను  భారత్‌కు తరలించడంలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ అత్యవసర సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు హర్ష్ వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీతో జరిగిన సమావేశంలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ పరిస్థితిపై దాదాపు 90 నిమిషాలపాటు చర్చించారు. అక్కడి భారతీయ విద్యార్థుల ఇక్కట్లను స్టాండింగ్ కమిటీ ప్రస్తావించింది. భయంతో ఉక్రెయిన్‌ను విడిచిపెడుతున్న భారతీయ విద్యార్థుల వద్ద పాస్‌పోర్టులు కూడా లేవన్న విషయాన్ని చౌదరి లేవనెత్తారు.
దీంతో స్పందించిన ష్రింగ్లా.. పాస్‌పోర్టులు లేని వారు భయపడాల్సిన అవసరం లేదని, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద విదేశాంగ శాఖ అధికారులు పాస్‌పోర్టులు లేని భారతీయలకు అత్యవసర సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 5 విమానాల్లో 1200 మంది విద్యార్థులను తరలించినట్టు చెప్పారు.