కేటీఆర్‌, కవిత ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నారు?

కేటీఆర్‌, కవిత ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నారు?
‘‘ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న కేటీఆర్‌, కవిత ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నారు? కవిత ఏ జైలుకు వెళ్లారు? కేటీఆర్‌ ఎక్కడ సత్యాగ్రహం చేశారు?’’ అని సీఎం కేసీఆర్ ను బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ఛుగ్‌ ప్రశ్నించారు.  ఇటీవల యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసిన అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, నాయకురాలు రాణిరుద్రమ ఆదివారం భారీ ర్యాలీతో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.  వారికి బిజెపి నాయకులు ఘనస్వాగతం పలికారు.
 
బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం బాగుపడటమేనా అని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువత కుటుంబాలను త్యాగం చేశారని ఆయన చెప్పారు. 
 
తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీనే బంగారు తెలంగాణకు అడ్డంకి అని చుగ్ స్పష్టం చేశారు.  స్వరాష్ట్రం కోసం పోరాడిన వారంతా ఇప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని తెలిపారు. 
 
బంగారు తెలంగాణ కలను సాకారం చేసే ప్రభుత్వం అసెంబ్లీలో అడుగుపెట్టే వరకు బీజేపీలో చేరికలు ఆగవని పేర్కొన్నారు .తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు బీజేపీ ప్రజాస్వామ్యయుత పోరాటం కొనసాగుతుందని చుగ్ స్పష్టం చేశారు.
 
జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మాట్లాడుతూ, ‘‘ఒంటరిగా తెలంగాణ తెచ్చే శక్తి మీకు ఉందా? 1200 మంది యువత సరదాగా చనిపోయారా?’’ అని నిలదీశారు. పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టిసారించబోతోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వెల్లడించారు. 
 
బీజేపీ అంటే సీఎం కేసీఆర్‌ గజగజ వణుకుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఫాం హౌస్‌ నుంచి ప్రగతిభవన్‌కు, అక్కడి నుంచి ధర్నాచౌక్‌కు కేసీఆర్‌ను బీజేపీయే రప్పించిందని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటించడానికి తామే కారణమని చెప్పారు. 
 
కేసీఆర్‌ అంటకాగుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లోని కుటుంబపార్టీలు కలిస్తే దేశం ఎంత దయనీయంగా మారుతుందో ఆలోచించాలని ప్రజలను ఆయన హెచ్చరించారు. 
 
కర్మన్‌ఘాట్‌లో గోరక్షకులపై తల్వార్‌లు పట్టుకుని హనుమాన్‌ ఆలయంలో దాడి చేసిన వారిని అరెస్టు చేయాల్సిందిపోయి, గోరక్షకులపైనే 307 కేసులు పెట్టారని సంజయ్‌ మండిపడ్డారు.   తల్వార్‌లు పట్టుకుని తిరిగే పరిస్థితి తమకు కల్పించవద్దంటూ కేసీఆర్‌ ను హెచ్చరించారు.  జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పోలీసులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
కాగా.. తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ సంస్థాగత సహకార్యదర్శి శివప్రకాశ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్లతో విడివిడిగా సమావేశమయ్యారు.