రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రాధాన్యం

రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రాధాన్యం
సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ప్రపంచానికి మాత్రమే పరిమితం కాలేదని, ఇప్పుడు అది జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  బడ్జెట్ సమర్పణ అనంతరం రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన వెబినార్‌లో ఆయన ప్రసంగిస్తూ రక్షణ రంగానికి చెందిన పరికరాలను దిగుమతి చేసుకునే ప్రక్రియ సుదీర్ఘమైందని తెలిపారు. 
 
 అవి మన భద్రతా దళాలకు అందే సమయానికి వాటిలో చాలా పరికరాలు కాలం చెల్లినవిగా మారిపోతున్నాయని చెబుతూ  దీనిక పరిష్కరారం మనం సొంతంగా వాటిని తయారు చేసుకోవడమేనని ప్రధాని స్పష్టం చేశారు. 
 
మన దేశం బానిసత్వంలో ఉన్న కాలంలోను, ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కూడా మన రక్షణ ఉత్పత్తుల శక్తి చాలా గొప్పదని, భారత్‌లో తయారైన ఆయుధాలు రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా గొప్ప పాత్ర పోషించాయని మోదీ గుర్తు చేశారు. 
 
 ఆ తర్వాతి కాలంలో మన శక్తి క్షీణిస్తూ వచ్చిందని పేర్కొంటూ అయితే  భారత్‌లో శక్తి సామర్ధ్యాలకు అప్పుడు.. ఇప్పుడు లోటు లేదని ఆయన పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్‌లో దాదాపు 70 శాతం దేశీయ పరిశ్రమల కోసం కేటాయించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మన దేశం 75 దేశాలకు పైగా రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని ఆయన వెల్లడించారు.