మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జిఒ 217 వద్దు!

మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జిఒ 217 వద్దు!
మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీయాలని చూస్తే ఊరుకొనేది లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిఒ 217ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మత్స్యకారులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. 
 
ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి రోడ్‌షో నిర్వహిస్తూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకున్నారు. అనంతరం ఇక్కడ జరిగిన మత్స్యకార అభ్యునుతి సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో 555 గ్రామాల్లో 70 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. 
 
217 జిఒ అమలు చేసి మత్స్యకారుల పొట్టగొట్టాలని చూస్తే చేతులు కట్టుకుని కూర్చోబోమని, క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిఒ కాపీని చించుతున్నానని, వైసిపి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టుకున్నా జైలుకు వెళ్లడానికి తాను సిద్ధమని తెలిపారు. 
 
తీరంలో రకరకాల నిబంధనలు తెచ్చి మత్స్యకారులకు ఉపాధి లేకుండా చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. చెరువులు, కుంటలను సైతం మత్స్యకారులకు దక్కకుండా చేసేందుకు వైసిపి ప్రభుత్వం పూనుకుందని ధ్వజమెత్తారు.  మత్స్యకారులకు రూ.పది లక్షలు బీమా ఇస్తామని హామీ ఇచ్చి రూ.ఐదు లక్షలు కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. 
 
వేటకు వెళ్లినప్పుడు ఏటా 140 మంది మత్స్యకారులు చనిపోతున్నారని చెబుతూ గడిచిన మూడేళ్లలో వైసిపి ప్రభుత్వం 64 మందికి రూ.ఐదు లక్షల చొప్పున మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
 అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం రోజున మత్స్యకారులకు ఇచ్చిన హామీలూ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి కరువవడంతో ఏటా 25 వేల మంది మత్స్యకారులు గుజరాత్‌కు వలస వెళ్తున్నారని, అక్కడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
 
 మత్స్యకార గ్రామాల్లో తాగడానికి కనీసం తాగునీరు కూడా లేదని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు గతుకులమయంగా ఉన్నాయని, రోడ్డుపై వస్తుంటే పడవ ప్రయాణం చేసినట్లు ఉందని విమర్శించారు. మత్స్యకారుల సమస్యలను వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడతానని ప్రకటించారు.  జనసేన నాయకుడు బమ్మిడి నాయకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాదెండ్ల మనోహర్‌, పవన్‌ సోదరుడు నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
 
 వైసీపీ నేతల పిచ్చి మాటలకు, చేతలకు భయపడేది లేదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. సహనంతో ఉంటున్నామని.. అది బలహీనత కాదని.. తమ బలమని  పేర్కొన్నారు. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని చెప్పారు.‘చావనైనా చస్తా, తల వంచేందుకు సిద్ధంగా లేను. వంగి వంగి దండాలు పెట్టేందుకు రాజకీయాల్లోకి రాలేదు’ అని హెచ్చరించారు. 
 
 సాహసమే ఊపిరిగా వచ్చా. మత్స్యకారులు సాహసవీరులని పేర్కొంటూ  రాష్ట్రంలో 65 లక్షల మంది మత్స్యకారుల్లో సాహసం నిండి ఉంది. అదే స్ఫూర్తిగా భావించి పోరాటయాత్ర ప్రారంభించానని  స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల బతుకులు రోడ్డున పడ్డాయని ధ్వజమెత్తారు.