ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
కాగా ఆస్పత్రికి వచ్చేటప్పటికే గౌతమ్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణం నిలబడలేదు. ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారం ఇచ్చారు. 
 
మంత్రి ఇకలేరన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా..  పరిశ్రమల శాఖ మంత్రి అయిన మేకపాటి వారం రోజులపాటు దుబాయ్ పర్యటనలో ఉన్నారు.
ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి జగన్ ప్రభుత్వం దుబాయ్‌ ఎక్స్‌పో వేదికగా పలు కంపెనీలతో పరిశ్రమల శాఖ ఎంవోయూలు చేసుకుంది. వారం రోజులపాటు పర్యటన ముగిసిన అనంతరం ఆదివారం నాడు గౌతమ్ హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు.
ఈ కీలక భేటీలో దుబాయ్‌ పర్యటనకు సంబంధించి వివరాలన్నీ సీఎంకు వివరించాలని మేకపాటి అనుకున్నారు. భేటీ తర్వాత అమరావతిలోనే మేకపాటి ప్రెస్‌మీట్ కూడా నిర్వహించాలని భావించారు.. అయితే ఇంతలోనే పెనువిషాదం చోటుచేసుకుంది. దుబాయ్ పర్యటన ద్వారా ఏపీకి రూ. 5,015 కోట్ల పెట్టుబడులను గౌతమ్ తీసుకొచ్చారని తెలుస్తోంది.
 
మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. 1971 నవంబర్‌2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు.  నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు.  ఇటీవలే కరోనా  బారిన పడి కూడా కోలుకున్నారు.
గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నాయకుడుగా పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధను కలిగించిదన్నారు. భారమైన హృదయంతో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్ తెలియజేశారు.
 
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాల్సిన గౌతమ్ రెడ్డిని మృత్వువు కబళించిందని ఆవేదన చెందారు. గౌతమ్ రెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా అందిరితోను ఆప్యాయంగా కలిసిపోయేవారని, హుందాగా ప్రవర్తించేవారని పేర్కొన్నారు. ‎ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.