రహస్య పత్రాల లీక్ కేసులో ఎన్‌ఐఎ మాజీ అధికారి అరెస్ట్ 

ఉగ్రవాద సంస్థకు రహస్య పత్రాలు లీక్‌ చేశారన్న తమ మాజీ పోలీసు అధికారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)  అరెస్ట్‌ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్‌కు రహస్య పత్రాలను లీక్‌ చేశారనే ఆరోపణలపై టాప్‌ ఇన్వెస్టిగేటర్‌, పోలీస్‌ సూపరింటెండెంట్‌ అరవింద్‌ దిగ్విజయ్ నేగిని అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌ఐఎ తెలిపింది. 
 
2011 బ్యాచ్‌ ఐపిఎస్‌ అధికారి అయిన నేగిని గత ఏడాది జమ్ముకాశ్మీర్‌ మానవ హక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్‌ను అరెస్టు చేసిన కేసులోనే ఆయన్ను కూడా అదుపులోకి తీసుకుంది. ఎన్‌ఐఎకి అందిన సమాచారం ప్రకారం.. పర్వేజ్‌ ద్వారానే ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్‌కు రహస్య పత్రాలు అందాయి. 
 
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళిక, అమలు కోసం ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్ల (ఒజిడబ్ల్యూ) నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దర్యాప్తు జరుపుతుంది. 
 
దర్యాప్తులో భాగంగా గతంలో ఎన్‌ఐఎలో ఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన నేగిపై అనుమానం వ్యక్తం చేసిన దర్యాప్తు సంస్థ హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఆయన నివాసంలో ఇంట్లో సోదాలు జరిపింది. ఆయనే రహస్య పత్రాలను ఆయన లీక్‌ చేసినట్లు గుర్తించారు. దీంతో ఐపిఎస్‌ అధికారి అరవింద్‌ దిగ్విజరు నేగిని ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.