ఆప్‌ కాంగ్రెస్‌ ఫొటోకాపీ మాత్రమే

ఆప్‌ కాంగ్రెస్‌ ఫొటోకాపీ మాత్రమే

ఆప్‌ పార్టీని కాంగ్రెస్‌ ఫొటోకాపీ అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, భారత సైన్యం తమ ప్రతిభను చాటిచెప్పినప్పుడు వీరు సంతోషంగా లేరని విమర్శలు గుప్పించారు. ఒక పార్టీ పంజాబ్‌ను పూర్తిగా దోచుకుంది.. మరోపార్టీ ఢిల్లీలో అవినీతి చేస్తోందంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బుధవారం పఠాన్‌కోట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆప్‌.. కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తీసుకుందని మోదీ ఆరోపించారు. పంజాబ్‌లో ఈసారి ప్రభుత్వం కచ్చితంగా మారాలి  అని పంజాబీలు నిర్ణయించుకున్నారని ప్రధాని ఆశాభావం వ్యక్తపరిచారు. 

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేరాల్లో భాగస్వాములని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు WWFలో మాదిరిగా  పరస్పరం పోటీ పడుతున్నట్లు నటిస్తున్నాయన్నారు. 2016 పఠాన్‌కోట్ దాడిలో మరణించిన సైనికుల త్యాగాలను కాంగ్రెస్ తక్కువ చేసి అవమానించిందని మోదీ ఆరోపించారు. దాడికి కాంగ్రెస్ పార్టీ తప్ప దేశమంతా కలిసికట్టుగా ఉందని పెక్రోన్నారు. దాడులపై కాంగ్రెస్‌ పార్టీ..సైనికుల త్యాగాలను తక్కువ చేసిందని విమర్శించారు.

సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో కూడా రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని ప్రశ‍్నించడాన్ని ప్రధాని తప్పుబట్టారు. 1965లో కాంగ్రెస్‌ ప్రయత్నించి ఉంటే గురునానక్‌ జన్మస్థలం (కర్తార్‌పూర్‌ గురుద్వారా) భారతదేశంలో ఉండేదని ప్రధాని మోదీ తెలిపారు.

పంజాబ్‌కు కాంగ్రెస్ మాదక ద్రవ్యాల జాఢ్యాన్ని తీసుకొచ్చిందని, ఢిల్లీ యువతను ఆమ్ ఆద్మీ పార్టీ మద్యంలో ముంచేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని చెప్పారు. మన సైనికుల ధైర్యసాహసాలు, శక్తిసామర్థ్యాలను కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారని గుర్తు చేస్తూ  కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్న ఇటువంటి అభిప్రాయాలను కెప్టెన్ అమరీందర్ సింగ్ అప్పట్లో ఆపారని చెప్పారు.

ఇప్పుడు ఆయన కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారని పేర్కొంటూ కాంగ్రెస్‌కు మరోసారి అవకాశం ఇస్తే, పంజాబ్ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తుందని ప్రధాని హెచ్చరించారు.

1984లో సిక్కులపై జరిగిన దాడుల నిందితులను బీజేపీ ప్రభుత్వం కటకటాల వెనుకకు నెట్టిందని ప్రధాని పెక్రోన్నారు. 1947లో దేశ విభజన జరిగినపుడు కర్తార్‌పూర్ సాహిబ్ పాకిస్థాన్‌లో కలవడంలో కాంగ్రెస్ పాత్రను ప్రశ్నించారు. 1965 యుద్ధం సమయంలో కూడా దీనిని వెనుకకు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించలేదని ధ్వజమెత్తారు

.1971 యుద్దం సమయంలో 90 వేల మంది పాకిస్థానీ సైనికులను భారత దేశం విడిచిపెట్టిందని గుర్తు చేస్తూ కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను భారత దేశానికి ఇస్తేనే ఈ సైనికులను విడిచిపెడతామని షరతు పెట్టి ఉండవలసిందని చెప్పారు.

తాము ఎక్కడ గెలిచినా, రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని తొలగిస్తామని, బుజ్జగింపులు, వంశపారంపర్య రాజకీయాలను దూరం చేస్తామని ప్రధాని  స్పష్టం చేశారు. తాము నూతన పంజాబ్‌ను తీర్చిదిద్దుతామని చెబుతూ  ప్రజలు ఒకసారి తమకు మద్దతిస్తే, ఇక వదిలిపెట్టరని ఆశాభావవం వ్యక్తం చేశారు.

వేర్పాటువాదులకు కేజ్రీ మద్దతుదారుడు

ఇలా ఉండగా, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ పై ఆ పార్టీ మాజీ నేత, కవి కుమార్ విశ్వాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. పంజాబ్ ను ప్రత్యేక దేశంగా చేయాలని డిమాండ్ చేస్తున్న ఖలిస్థాన్ వేర్పాటువాదులకు కేజ్రీవాల్ మద్దతుదారుడని ఆయన ధ్వజమెత్తారు. 
 
‘భవిష్యత్తులో ఒక రోజు నేను పంజాబ్ కు ముఖ్యమంత్రిని అవుతా లేదా స్వతంత్ర (ఖలిస్థాన్) దేశానికి తొలి ప్రధాని అవుతా’ అని కేజ్రీవాల్ చెప్పారని విశ్వాస్ వెల్లడించాయిరు. తాను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు కేజ్రీవాల్ తనతో ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పాకిస్థాన్ తో సరిహద్దు కలిగి ఉన్న పంజాబ్ రాష్ట్రం విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.