
ఏపీకి మూడు రాజధానులతో ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుందని, అయితే , మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టమని కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ..మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని ఇప్పటికీ రాష్ట్ర మంత్రులు చెపుతూనే ఉన్నారని అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందని, ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చెందడం లేదని చెప్పారు. అలాంటప్పుడు 3 రాజధానుల అంశం సరికాదని సూచించారు. ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదని, అటువంటప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన వేళలోనే ఏపీ రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం దీనిని విస్మరించిందని చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని విచారం వ్యక్తం చేశారు. దీనికి మోదీ ప్రభుత్వం నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని చెప్పారు.
నిధులు లేకపోతే రాజధాని నిర్మాణం ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోడీని సీఎం జగన్ కలసి కోరాలని కేంద్ర మంత్రి సూచించారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో, జగన్ చేతులు కలపాలని హితవు పలికారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం తాను కూడా ప్రయత్నిస్తానని చెప్పారు.
More Stories
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు
రేణిగుంటలోని చైనా దేశస్తుడి నివాసంలో ఈడీ సోదాలు
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని