చికాగో కన్నా ముందే హైదరాబాద్ లో వివేకానంద తొలి ప్రసంగం 

నారాయణరావు 

* ఫిబ్రవరి 13ను తెలంగాణ ప్రభుత్వం `వివేకానంద డే’గా ప్రకటించాలి!

ఫిబ్రవరీ 13… 1893… 129 సంవత్సరాల క్రితం… మనల్ని ఆధునిక భరతజాతి చరిత్రని మలుపుతిప్పిన ఒకానొక మహోన్నత ఘట్టానికి హైదరాబాద్ కేంద్రంగా నిలిచింది. చికాగోలో ప్రపంచ వేదికపై భారతీయ సనాతన మహోన్నత్వంను చాటిచెప్పడానికి ముందు స్వామి వివేకానంద తన మొదటి విదేశీ పర్యటన లక్ష్యాన్ని వివరించింది ఇక్కడే… ఆ రోజున. 

అందుకనే ఆ రోజును `వివేకానంద డే’గా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని  రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యువత కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నారు.

స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగరంలో పర్యటించి ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో “మై మిషన్ టు ద వెస్ట్” (పాశ్చాత్యానికి వెళ్లడంలోని నా ఉద్దేశం) అనే అంశంపై తొలి చారిత్రక ప్రసంగం చేశారు. యూరోపియన్లు, మేధావులు, విద్యావేత్తలు, యువకులు సహా సుమారు వెయ్యిమంది హాజరైన భారీ బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగించడం స్వామి వివేకానంద జీవితంలో అదే తొలిసారి.

ఆంగ్ల భాషలో ప్రసంగించిన స్వామీజీ సభకు హాజరైన వారిని తన వాగ్ధాటితో మంత్రముగ్ధులను చేశారు. హైందవ ధర్మ ప్రాశస్త్యము, సంస్కృతి, వేద వేదాంత భావనలు, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు ఇలా అనేక అంశాల గురించి స్వామి వివేకానంద వివరించారు. 

భారత దేశ ఔన్నత్యాన్ని, బహుముఖంగా చాటి చెప్పడంతో పాటు పాశ్చాత్య దేశాలకు వెళ్లడంలోని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. భారత దేశాన్ని నూతన జవసత్వాలతో పునరుజ్జీవింపచేయాలనే ఉద్దేశంతోనే చికాగో వెళ్లాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

అమెరికాలోని చికాగోలో విశ్వమత ప్రతినిధుల సభలో పాల్గొనడానికి వెళ్లే ముందు హైదరాబాద్‌ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా తన ఉపన్యాస నైపుణ్యాలను పరీక్షించుకున్నట్లు స్వామి వివేకానంద తన శిష్యులతో స్వయంగా చెప్పారు. 

స్వామి వివేకానందలో ఆత్మవిశ్వాసం ఇనుమడింప చేసిన భాగ్యనగర పర్యటన ఆ తర్వాత విశ్వవేదికపై జైత్రయాత్ర కొనసాగేలా చేసింది స్వామి వివేకానంద భాగ్య నగర పర్యటన, చారిత్రక ప్రసంగం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యూత్ కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నారు. 

అనేక మంది మేధావులను, విద్యావేత్తలను, విద్యార్ధినీ విద్యార్ధులను కలుస్తున్నారు. స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. సంతకాల సేకరణ చేస్తున్నారు. వేలాది మంది ఇప్పటికే తమ మద్దతును తెలియజేశారు.

భరతమాత స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన బాల గంగాధర్ తిలక్ నుంచి సుభాష్ చంద్రబోస్ వరకూ అనేకమంది స్వాతంత్య్ర పోరాట వీరులకు స్ఫూర్తిగా నిలిచిన స్వామి వివేకానందతో భాగ్యనగరానికున్న అనుబంధం తెలంగాణకే గర్వకారణం.

స్వామి వివేకానంద పాదస్పర్శతో భాగ్యనగరం పవిత్ర భూమి గా మారిన సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలని యువత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.