
కర్ణాటకలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు విస్తృత ధర్మాసనానికి నివేదించింది. తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఉపశమనం లభించలేదు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వలేదు.
కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ బుధవారం ఇచ్చిన ఆదేశాల్లో ఈ పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్‌ను ధరించేందుకు అనుమతి ఇవ్వడానికి తాత్కాలిక ఆదేశాలను జారీ చేయడంపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఇదిలావుండగా, బెంగళూరు నగరంలో పాఠశాలలు, కళాశాలల వద్ద నిరసనలు, ప్రదర్శనలను రెండు వారాల పాటు నిషేధిస్తూ కర్ణాటక పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, ప్రీ యూనివర్సిటీ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు లేదా ఇటువంటి విద్యా సంస్థల గేట్ల నుంచి 200 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, ఈ నిషేధం రెండువారాలపాటు అమలవుతుందని తెలిపారు.
మాండ్య జిల్లాలోని ఓ కళాశాలలో ఓ విద్యార్థినిని కొందరు విద్యార్థులు ఘెరావ్ చేసినట్లు వైరల్ అవుతున్న వీడియోపై కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నాగేష్ స్పందించారు. క్యాంపస్‌లో జై శ్రీరామ్, అల్లాహు అక్బర్ నినాదాలను ప్రోత్సహించరాదన్నారు. ఆ విద్యార్థిని కళాశాల వెలుపలికి వస్తూండగా, ఆమెను విద్యార్థులు ఘెరావ్ చేయలేదన్నారు.
ఆమె అల్లాహు అక్బర్ అని నినదిస్తున్నపుడు ఆమె చుట్టుపక్కల ఎవరూ లేరని గుర్తు చేశారు. ఆమెను ఎవరైనా రెచ్చగొట్టారా? అని ప్రశ్నించారు. ఇటువంటి నినాదాలను ప్రోత్సహించరాదన్నారు.
కర్ణాటక హిజాబ్ వివాదంలో అరెస్టు అయిన నిరసనకారులు విద్యార్థులు కాదని వారు బయటి వ్యక్తులని రాష్ట్ర హోంశాఖమంత్రి అరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. బాగల్ కోట్ పట్టణంలో హిజాబ్ నిరసనలు హింసాత్మకంగా మారడంతో శివమొగ్గలో 144 సెక్షన్ ను విధించామని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో ఎక్కడైనా అవాంఛనీయమైన ఘటనలు జరిగితే చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి చెప్పారు.తమ పోలీసులు అరెస్టు చేసిన వారు బయటి వ్యక్తులని, వారు విద్యార్థులు కాదని తేలిందని హోంశాఖ మంత్రి చెప్పారు. హిజాబ్ విషయంలో తాము హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని హోంమంత్రి చెప్పారు.
బెంగళూరులోని విధాన సౌధలో బుధవారం కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.ఈ మంత్రివర్గ సమావేశంలో హిజాబ్ వివాదం గురించి మంత్రులు చర్చించారు.మంత్రివర్గ సమావేశానికి ముందు కర్ణాటక హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర బుధవారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని కలిశారు. హిజాబ్ నిరసనల సందర్భంగా రాళ్ల దాడి ఘటన, అనంతరం అరెస్టుల గురించి హోంశాఖ మంత్రి సీఎంకు వివరించారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం