`మీడియా వన్’ పై నిషేధం సమర్ధించిన కేరళ హైకోర్టు

`మీడియా వన్’ పై నిషేధం సమర్ధించిన కేరళ హైకోర్టు
`మీడియా వన్’ టీవీ చానల్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను కేరళ హైకోర్టు సమర్థించింది. కొజిక్కోడ్‌లోని మాధ్యమమ్ బ్రాడ్‌కాస్టింగ్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు ఇచ్చింది. ఈ సంస్థ ఉద్యోగులు, కేరళ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. 
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా మాధ్యమమ్ బ్రాడ్‌కాస్టింగ్ లిమిటెడ్ యాజమాన్యంలోని `మీడియా వన్’ టీవీ చానల్ సెక్యూరిటీ క్లియరెన్సును పునరుద్ధరించేందుకు తిరస్కరించినట్లు గుర్తించామని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది.
నిఘా సమాచారం చాలా సున్నితమైనది, రహస్యమైనది అని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్ మను వాదించారు. ఈ నిఘా సమాచారం ఆధారంగానే `మీడియా వన్’ టీవీ చానల్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ పునరుద్ధరణకు నిరాకరించినట్లు పేర్కొన్నారు.
విధానపరమైన అంశంగా, దేశ భద్రత దృష్ట్యా  ఈ చానల్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్‌ను పునరుద్ధరించేందుకు నిరాకరించడానికి కారణాలను వెల్లడించలేమని పేర్కొన్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను పరిశీలించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
లైసెన్సును పునరుద్ధరించాలన్నా సెక్యూరిటీ క్లియరెన్స్ తప్పనిసరి అని చెప్పారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని అంశాలను చిత్తశుద్ధతో పరిశీలించిందని స్పష్టం చేశారు.ఈ చానల్ లైసెన్స్ గడువు ముగిసిందని గుర్తు చేసారు.
పిటిషనర్ తరపున ఎస్ శ్రీకుమార్ వాదనలు వినిపిస్తూ లైసెన్స్‌ను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం గురించి ఎప్పుడూ వినలేదని, ఇది చట్టవిరుద్ధమని తెలిపారు. పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొన్నారు.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్యూరిటీ క్లయరెన్స్ మంజూరు చేసిన తర్వాత, కార్యక్రమాలను అప్‌లింకింగ్, డీలింకింగ్ చేయడానికి 2011లో అనుమతి మంజూరు చేశారని గుర్తు చేశారు. కొత్తగా చానల్‌ను ఏర్పాటు చేసేటపుడు మాత్రమే సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరమవుతుందని చెప్పారు.
10 ఏళ్ళ లైసెన్స్ పీరియడ్ పూర్తయిన తర్వాత లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. లైసెన్స్‌ను పునరుద్ధరించేటపుడు కొత్తగా సెక్యూరిటీ క్లియరెన్స్‌ను పొందాలని ప్రోగ్రామ్స్‌ను అప్‌లింకింగ్, డీలింకింగ్‌పై మార్గదర్శకాల్లో లేదని చెప్పారు.
సెక్యూరిటీ క్లియరెన్స్‌ను నిరాకరించినట్లు మాత్రమే ఎంహెచ్ఏ చెప్పిందని, అయితే భద్రతను ఏ విధంగా ఉల్లంఘించిందో చెప్పలేదని తెలిపారు. దేశ భద్రతకు ఈ చానల్ ఆటంకాలు కలిగించలేదని స్పష్టం చేశారు.