
త్వరితగతిన రామాలయ నిర్మాణం జరుగుతున్న అయోధ్యలో రామాయణ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. రామాయణ విశ్వవిద్యాలయంలో శ్రీరాముడి జీవితం, ఆయనకు సంబంధించిన సంస్కృతి, గ్రంథాలు తదితర అంశాలపై అధ్యయనాలు, పరిశోధనలు జరగనున్నాయి.
అయోధ్యలో దాదాపు 21 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని నిర్మించనున్నారు. ఇందుకోసం మహర్షి విద్యాపీఠ్ ట్రస్టు రూపురేఖలు సిద్ధం చేసింది. ప్రతిపాదిత యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ రంగం నిర్మించే అవకాశం ఉంది. రామనగరి అయోధ్యలో పరిశోధనల కోసం రామాయణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ విశ్వవిద్యాలయంలో కొన్ని విభాగాలు ఉంటాయని, ఇందులో రామాయణ పరిశోధన, బోధనకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. దీనితో పాటు హిందీ, సంస్కృత భాషలకు యూనివర్సిటీలో ప్రముఖ స్థానం కల్పించనున్నారు.
ఇందులో విద్యార్థులకు వేదం, రామాయణం, ఉపనిషత్తులు, యోగా, ధ్యానం, ఆయుర్వేదం తదితర అంశాలను బోధించనున్నారు. రామాయణ విశ్వవిద్యాలయం మొదటి దశలో సుమారు 500 మంది విద్యార్థుల ప్రవేశానికి అవకాశం కల్పించనున్నారు. విశ్వవిద్యాలయం బహుళ అంతస్తులతో కూడి ఉంటుంది.
దీంతో పాటు ఇక్కడ నివసించే విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం పురాతన, సంప్రదాయ జ్ఞాన సంపదను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం. యువతలో ఆధ్యాత్మిక చింతనను బలోపేతం చేయడం.
యూపీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం రామాయణ విశ్వవిద్యాలయం రాముని, జీవితం, ఆయన ఆచరించిన విలువల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలియజేస్తుంది. ఇందులో హిందూ ధర్మం, సంస్కృతిపై అధ్యయనాలు కూడా ఉంటాయి. విశ్వవిద్యాలయంలోని ప్రాచీన వేద విద్యా విధానంతో ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అనుసంధానం చేసేందుకు కూడా కృషి చేయనున్నారు.
యుపిలో క్రీడా, ఆయుష్, లా యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంను ఉన్నత విద్యకు ప్రముఖ కేంద్రంగా చేయడం కోసం 16 మందితో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన్నట్లు చెప్పారు.
అయోధ్యలోని రామాలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ, ప్రతిపాదిత విశ్వవిద్యాలయం కొత్త తరానికి శ్రీరాముడి విలువలను ఆచరించడానికి, హిందూ సంస్కృతి గురించి మరింత తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని అభిలాష వ్యక్తం చేశారు.
2017 నుండి, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేపట్టినప్పటి నుండి, అయోధ్యలో భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికి సంస్కరణలు, కొత్త పథకాలను అవిశ్రాంతంగా ముందుకు తెస్తున్నారు. యోగి ప్రభుత్వం సూరజ్‌కుండ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్’ పేరుతో అత్యాధునిక విమానాశ్రయం నిర్మాణం చేపట్టింది.
ఒక మ్యూజియం, రాముడి జీవితంపై ఒక ఎన్సైక్లోపీడియా మరియు ఇప్పుడు రాముడి పేరు మీద ఒక విశ్వవిద్యాలయం వంటి కార్యక్రమాలు అయోధ్యను సనాతన ధర్మంపై అధ్యయనంకు ప్రముఖ కేంద్రంగా మార్చనున్నది.
అయోధ్యకు పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి 2021-22 ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో, శ్రీరాముడి నగరం అభివృద్ధి, సుందరీకరణ కోసం దాదాపు రూ 658 కోట్లు కేటాయించారు. ఆధ్యాత్మిక సంస్థలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో రూ 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి కూడా సన్నాహాలు చేస్తున్నది. . రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలకు కూడా రాష్ట్ర ఖజానా నుండి 300 కోట్లు కేటాయించారు.
2017 నుండి, యోగి ప్రభుత్వం అద్భుతమైన అయోధ్య నగరానికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. సరయూ ఘాట్ల సుందరీకరణ, 2019 నుండి దీపావళికి లక్ష దీపార్చన వంటి కార్యక్రమాల ద్వారా అయోధ్య కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించే దిశగా అద్భుతమైన అడుగులు వేస్తున్నారు.
గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు చాలా అరుదుగా అయోధ్యను సందర్శించేవారు. దానికి విరుద్ధంగా, యోగి తరచుగా సందర్శించడం, నగరం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం ద్వారా అయోధ్య తన వైభవాన్ని తిరిగి పొందే వరకు విశ్రమించబోరని వెల్లడి చేస్తుంది.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?