ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి హాజరు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ను ఎత్తేశారు. సోమవారం నుంచి ఉద్యోగులందరూ యధావిధిగా ఆఫీసులకు రావాల్సి ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. 

జనవరిలో కేసులు పెరిగిన నేపథ్యంలో…  50 శాతం సిబ్బంది మాత్రమే ఆఫీసులకు రావాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 15 వరకు ఈ విధానం అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దేశంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నందున ఫిబ్రవరి 7 నుంచే ప్రభుత్వ కార్యాలయాలను పూర్తి స్థాయిలో పని చేయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

అన్ని స్థాయుల్లోని ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే ఉద్యోగులందరూ విధిగా మాస్కులు ధరించడంతోపాటు కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధిపతులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మెమో జారీ చేసింది.

లక్ష లోపే కేసులు 

మరోవంక, దేశంలో కరోనా ఉధృతి తగ్గుతుంది. నెల రోజుల తర్వాత లక్ష లోపు కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11,56,363 మందికి పరీక్షలు చేయగా.. 83,876 కొత్త కేసులు వెగులుచూశాయి. జనవరి 6 తర్వాత లక్ష దిగువకు కేసులు నమోదవ్వడం ఇదే ప్రధమం. 

తాజాగా 895 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,22,72,014కి చేరుకోగా… ఇప్పటి వరకు 5,02,874 మంది మహమ్మారి బలితీసుకుంది. పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో లక్ష 99 వేల మందికి పైగా కోలుకోగా…మొత్తంగా, 4.06 కోట్ల మంది కోలుకున్నారు. 

రివకరీ రేటు 96.19 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 11,08,938గా ఉంది. క్రియాశీలక రేటు 2.62 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.