యుపిలో అఖిలేష్ కు ఊహించని విధంగా గట్టి పోటీ!

యుపిలో అఖిలేష్ కు ఊహించని విధంగా గట్టి పోటీ!
ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయని ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ అధికారంలోకి వస్తామని నమ్మకం లేకనే పోటీ చేయడం లేదని అంటూ బిజెపి నాయకులు ఎద్దేవా చేయడంతో మొదటిసారి పోటీకి దిగారు.  ప్రస్తుతం అజాంఘడ్ నుంచి లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నఆయన తన కుటుంబానికి కంచుకోట అయిన మెయిన్ పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకొని, సన్నిహితులతో కలసి నామినేషన్ దాఖలు చేశారు.
 
 ఈ నియోజకవర్గంలో దాదాపు 3.5లక్షలమంది ఓటర్లు ఉండగా.. ఇందులో దాదాపు లక్షన్నర వరకూ యాదవులే ఉన్నారు.  దానితో గెలుపు సులభం అనుకున్నారు. అయితే అనూహ్యంగా బిజెపి సహితం బలమైన అభ్యర్థిని ఆయనపై పోటీకి దింపడంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది.
యాదవ్ ను దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ కేంద్ర మంత్రి, అగ్రా నుండి లోక్ సభకు ఎన్నికైన సత్యపాల్ సింగ్ బాగెల్ ను బరిలోకి దింపుతోంది. పైగా ఆయన మాజీ ఎస్పీ నాయకుడు కావడం, ఆ పార్టీ నుండి రెండు సార్లు ఎంపీగా ఉండడం గమనార్హం.
 
పోలీస్‌ ఎస్‌ఐగా తన కెరీర్‌ ప్రారంభించిన ఎస్పీ సింగ్‌ బఘేల్‌.. మాజీ సీఎం, ఎస్పీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఎస్పీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం బీఎస్పీలో చేరిన ఎస్పీ సింగ్‌ బఘేల్‌కు 2014లో మాయావతి రాజ్యసభ సీటు ఇచ్చారు.
 
అనంతరం బిజెపిలో చేరిన ఎస్పీ సింగ్‌ బఘేల్‌  2017 అసెంబ్లీ ఎన్నికల్లో తుండ్లా స్థానం నుంచి గెలిచి, యోగి ఆడియనాథ్ మంత్రివర్గంలో చేశారు.  ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆగ్రా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మోదీ మంత్రివర్గంలో న్యాయ శాఖ సహా మంత్రిగా చేరారు. 
 
 మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న అఖిలేష్‌కు పోటీగా బఘేల్‌ను మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి దింపడంతో కర్హల్‌ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కర్హాల్ స్థానానికి మూడోదశలో ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది.