శివసేన నేతలపై బిజెపి సుప్రీం కోర్టులో కేసు

మహారాష్ట్ర అసెంబ్లీ నుండి 12 మంది బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు శివసేన నేతలపై బిజెపి కేసు నమోదు చేయనుంది. 
 
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ  సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శివసేన నేత సంజయ్ రౌత్, రవాణా శాఖ మంత్రి అనిల్‌ పరాబ్‌ వ్యాఖ్యలు చేయడంపై తాము అత్యున్నత న్యాయ స్థానంలో కేసు దాఖలు చేస్తామని చెప్పారు. కోర్టు ఇచ్చిన తీర్పును కొంత మంది శివసేన నేతలు ప్రశ్నిస్తున్నారని పేర్కొంటూ  వారు న్యాయవ్యవస్థను అవమానిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 

కాగా, గత జులై వర్షాకాల సమావేశాల సందర్భంగా బిజెపి ఎమ్మెల్యేలు స్పీకర్‌ చాంబర్‌ వద్ద రణరంగం సృష్టించారు. దీంతో 12 మంది బిజెపి ఎమ్మెల్యేలపై సంవత్సర కాలం పాటు వేటు పడింది. దీన్ని సవాలు చేస్తూ వారు సుప్రీంకోర్టు మెట్లెక్కగా.. ఇటీవల విచారణ చేపట్టిన కోర్టు.. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని, చట్టవిరుద్ధమని పేర్కొన్నది. 
 
 ఈ వేటు వర్షాకాల సమావేశాల వరకే వర్తిస్తుందని చెబుతూ, వారిపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. దీనిపై శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ శాసన మండలిలో 12 మంది సభ్యుల నామినేషన్లను నిలుపుదల చేశారని, కోర్టు దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు.
 
బిజెపికి మాత్రమే కోర్టులో ఉపశమనం ఎందుకు కలుగుతుందో అంటూ మరోసారి స్పందించారు. సస్పెన్షన్‌ రద్దు నిర్ణయం అసెంబ్లీ స్పీకర్‌ అధికార పరిధిలోకి వస్తుందని కూడా శివసేన నేతలు పేర్కొన్నారు.