ఫిబ్రవరి 1 నుండి తెలంగాణాలో విద్యాసంస్థలు ప్రారంభం 

తెలంగాణలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కాగా, కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత నేపథ్యం సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత స్కూళ్లు, కాలేజీలను ఈ నెలాఖరు వరకు మూసేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే నాటి నుంచి విద్యా సంస్థలను రీ ఓపెన్ చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు నిరసనలు చేస్తున్నాయి. 

కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు కాలేజీలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 30 తర్వాత పాఠశాలలు తెరుస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. యూనివర్సిటీలు, కాలేజీలు మూసేస్తూ స్కూళ్లు తెరుస్తామని చెప్పడంపై హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. 

పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ అభిప్రాయం ఏంటో తెలిజేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జనవరి 30తో సెలవులు ముగుస్తుండటం, పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని హైకోర్టు ఆదేశించడంతో  విద్యా సంస్థల రీ ఓపెన్‌కే ప్రభుత్వం సమాయాత్తమైంది.

ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు  నిర్వహిస్తున్నారు. వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదని, విద్యాసంస్థలు తెరవాలని తల్లిదండ్రులు కూడా కోరడం కూడా రీ ఓపెన్‌కే టీ సర్కార్‌ మొగ్గుచూపింది.

 ఇవాళ వైద్య శాఖ ఇచ్చిన రిపోర్టుపై విద్యాశాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలను ఓపెన్ చేసుకోవచ్చని వైద్యశాఖ రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విద్యా సంస్థలకు సంక్రాంతి తర్వాత పొడిగించిన సెలవులకు ముగింపు చెప్పి.. ఫిబ్రవరి 1 నుంచి  ఓపెన్ చేయాలని విద్యా శాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చారు.