
భారత అత్యున్నత ధర్మాసనం ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేజన్ల కేసుపై శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతఅత్వంలోని ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) , షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ప్రమోషన్‌లలో రిజర్వేషన్ కల్పనపై తామేలాంటి ప్రమాణాలను నిర్దేసించలేమని తెలిపింది. ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి న్యాయస్థానం వద్ద ఎలాంటి కొలమానం లేదని పేర్కొంది.
రిజర్వేషన్ల కోసం నిబంధనలను బలహీనపరచబోమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీని కోసం కొత్త కొలమానాన్ని విధించజాలమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు నేపథ్యంలో తాము కొత్తగా ఓ కొలమానాన్ని విధించడం సాధ్యం కాదని తెలిపింది.
ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలే లెక్కలు సేకరించాలని తెలిపింది. మొత్తం సర్వీసు ఆధారంగా కాక, రిజర్వేషన్ల ఆధారంగానే డేటాను సేకరించాలని స్పష్టం చేసింది. అదే విధంగా ప్రమోషన్ల డేటా సమీక్షకు వ్యవధి సహేతుకుంగా ఉండాలని తెలిపింది.
రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్రాలు తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. దామాషా ప్రాతినిధ్యం, తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలన్నీ రాష్ట్రాలే చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.
కాగా, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనలో ప్రమాణాలను నిర్దేశించడంలో ఎదురవుతున్న అయోమయాన్ని దూరం చేయాలని కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించాయి.
కేంద్ర ప్రభుత్వం అంతకుముందు వాదనలు వినిపిస్తూ, భారత దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, ప్రతిభ విషయంలో అగ్ర వర్ణాల స్థాయికి ఎస్సీ, ఎస్టీలు రాలేదని తెలిపింది.
ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్ల మంజూరుపై తీర్పును సుప్రీంకోర్టు అక్టోబరు 26న రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. 133 పిటిషన్లపై వాదనలను విన్న తర్వాత శుక్రవారం ఈ తీర్పును ఇచ్చింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్