అట్టహాసంగా 73వ  గణతంత్ర వేడుకలు

ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.   సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.  
 
 దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్ ఏఎస్ఐ బాబురామ్ కు అశోక్ చక్ర పురస్కారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి అందజేశారు.రాజ్ పథ్ లో గణతంత్ర పరేడు జరిగింది. ఈ పరేడులో దేశ సైనిక సామర్థ్యాన్ని చెప్పేలా ఘనంగా సాగింది. భారత వాయుసేన విన్యాసాలు, వివిధ రాష్ట్రాల శకటాలతో పరేడ్ సాగింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న వేళ.. భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రిపబ్లిక్ డే పరేడ్ సాగింది. 16 కవాతు విభాగాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ సిబ్బంది మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నారు.దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా.. భారతీయ వాయుసేన 75 యుద్ధవిమానాలతో గ్రాండ్  ప్లైపాస్ట్‌ నిర్వహించింది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, అపాచీ వంటి ఫైటర్‌ జెట్స్‌ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
 ఈ యేడాది నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పంజాబ్‌కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ప్రధానంగా పేర్కొంటూ పంజాబ్‌లో స్వాతంత్య్ర  పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు.
 
 ఇక జలియన్‌వాలా బాఘ్ నిందితుడు జనరల్ డయ్యర్‌ను సద్ధామ్ ఉద్దమ్ సింగ్ లండన్ వెళ్లి కాల్చి చంపిన ఘటనను కూడా ప్రస్తావించారు. త్రివిధ దళాలతో పాటు వివిధర రాష్ట్రాలు, వివిధ మంత్రిత్వ శాఖల శకటాల్లో స్వాతంత్ర్య పోరాటం నాటి ఆనవాళ్లు కనిపించినప్పటికీ పంజాబ్‌ శకటమే అమితంగా ఆకర్షించిందని నెటిజెన్లు అంటున్నారు.
 
కరోనా మూడో వేవ్‌ నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కుదించారు. 2500 మందిని రాజ్‌పథ్‌లో పరేడ్‌ చూసేందుకు అనుమతించారు. 15ఏళ్లలోపువారికి అనుమతి లేదు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు.
 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
వార్ మెమోరియల్ వద్ద సందర్శకుల సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోదీ సంతకం చేశారు.ఆజాదీ కా అమృత్ ఉత్సవం సందర్భంగా ఈ ఏడాది కవాతు నిర్వహించారు.గణతంత్ర వేడుకల్లో భాగంగా సైనిక సామర్థ్యం, సాంస్కృతిక వైవిధ్యంతో ప్రదర్శనలు చేశారు.
ఇండియా గేటు వద్ద ప్రధాని నరేంద్రమోదీ నేతాజీ డిజిటల్ విగ్రహం తెరను ప్రారంభించి రిపబ్లిక్ వేడుకలను ప్రారంభించారు.దేశంలో కోసం ప్రాణాలు అర్పించిన 25,942 మంది అమర సైనికుల పేర్లను వార్ మెమోరియల్ వద్ద గ్రానైట్ పై చెక్కారు.
 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సాయుధ పోలీసులను మోహరించారు. సాయుధ పోలీసుల పహరా మధ్య రిపబ్లిక్ డే వేడుకలు బుధవారం జరిగాయి.
 
గణతంత్ర దినోత్సవ వేడుకలు గత ఏడాది మాదిరిగా కాకుండా ఎలాంటి సంఘటనలు జరగకుండాఢిల్లీలోని తిక్రీ, సింఘు, ఘాజీపూర్‌తో సహా అన్ని ప్రధాన సరిహద్దు పాయింట్లను మూసివేశారు. సరిహద్దు పాయింట్ల వద్ద అదనపు పికెట్‌లను మోహరించి, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.ఢిల్లీలో రిపబ్లిక్ డే భద్రతా విధులకు 27,000 మంది పోలీసులను మోహరించి, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ముమ్మరం చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.