సభలు, రోడ్ షోలపై  జనవరి 31 వరకు నిషేధం 

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణపై నిషేధాన్ని జనవరి 31 వరకు ఎన్నికల కమీషన్ పొడిగించింది. ఈసీ శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, నిపుణులు, ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో ఈ విషయమై చర్చించింది.
 
రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని పొడిగించింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభల ఎన్నికల షెడ్యూలును ఈ నెల 8న ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
కరోనా  మహమ్మారి నేపథ్యంలో రోడ్ షోలు, బహిరంగ సభల నిర్వహణపై జనవరి 15 వరకు నిషేధం విధించింది. అనంతరం ఈ నిషేధాన్ని జనవరి 22 వరకు పొడిగించింది. అయితే సమావేశ మందిరాల్లో గరిష్ఠంగా 300 మందితో లేదా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సమావేశాలు నిర్వహించుకోవచ్చునని తెలిపింది.
 
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు జరిగే ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లోనూ, మణిపూర్‌లో రెండు దశల్లోనూ, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒక దశలోనూ ఈ ఎన్నికలు జరుగుతాయి.