రిపబ్లిక్ డే పరేడ్‌లో 25 అలంకృత శకటాలు

ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో 16 కవాతు దళాలు, 17 మిలిటరీ బ్యాండ్స్, వివిధ రాష్ట్రాలు, విభాగాలు, సాయుధ దళాలకు చెందిన మొత్తం 25 అలంకృత శకటాలు పాల్గొంటాయని భారత ఆర్మీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్మీ విభాగంలో ఒక ఒంటెల దళం, 14 మెకనైజ్డ్‌కాలమ్స్, ఆరు మార్చింగ్ బృందాలు, వైమానిక విభాగానికి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ల ఫ్లైపాస్ట్ ఉంటాయని ఆర్మీ తెలిపింది. 

మెకనైజ్డ్ కాలమ్స్‌లో ఒక పిటి76 ట్యాంక్, ఒక సెంచూరియన్ ట్యాంక్, రెండు ఎంబిటి అర్జున్ ఎంకె1 ట్యాంకులు, ఒక ఎపిసి టోపాస్ ఆర్మర్డ్ సిబ్బంది రవాణా వాహనం, ఒక బిఎంపి 1 ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్ వెహికిల్, రెండు బిఎంపి2 ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్ వెహికిల్స్ ఉంటాయని పేర్కొంది. 

ఒక 75/24 పాక్డ్ హోవిట్జర్, రెండు ధనుష్ హోవిట్జర్లు, ఒక పిఎంఎస్ బ్రిడ్జిలు అమర్చే వ్యవస్థ ఒక హెచ్‌టి16 ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్ర వ్యవస్థ, రెండు తరన్ శక్తి ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్ర వ్యవస్థలు, రెండు ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు కూడా ఉంటాయని తెలిపింది. 

భారతీయ సైన్యానికి చెందిన ఆరు కవాతు దళాల్లో రాజ్‌పుత్ రెజిమెంట్, అస్సాం రెజిమెంట్, జమ్మూ, కశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ, సిక్కిం లైట్ ఇన్‌ఫాంట్రీ, ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కోర్ రెజిమెంట్, పారాచూట్ రెజిమెంట్ ఉంటాయని ఆర్మీ ప్రకటన తెలిపింది.

భారతీయ వాయుసేన, నౌకాదళానికి చెందిన ఒక్కో బృందం కూడా ఈ కవాతులో పాల్గొంటాయి. కేంద్ర పారామిలిటరీకి సంబంధించి అయిదు బృందాలు కూడా ఈ కవాతులో పాల్గొంటాయి. ఇవి కాక ఢిల్లీ పోలీసు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌కు చెందిన బృందాలతో పాటుగా 17 మిలిటరీ బ్యాండ్ బృందాలు కూడా పాల్గొంటాయి. 

పరమవీర్ చక్ర అందుకున్న ఇద్దరు,అశోక్ చక్ర అందుకున్న ఒకరు కూడా ఇందులో పాల్గొంటారు. రిపబ్లిక్ పరేడ్ ప్రారంభం కావడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద విధి నిర్వహణలో అసువులు బాసిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. పరేడ్ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగుస్తుంది.

 ఇండో టిబెటన్ సరిహదు ్దపోలీసు( ఐటిబిపి)కి చెందిన పురుషుల బృందం, బిఎస్‌ఎఫ్‌కు చెందిన మహిళా బృందం మోటార్‌బైక్‌లపై సాహస క్రీడలను ప్రదర్శిస్తాయి. 

ఢిల్లీ ఏరియా జిఒసి లెఫ్టెనెంట్ జనరల్ విజయ్ కుమార్ మల్హోత్రా పరేడ్ కమాండర్‌గా ఉంటారని, మేజర్ జనరల్ అలోక్ కక్కర్ ఆయనకు సహాయకుడిగా ఉంటారని ఆర్మీ ఆ ప్రకటనలో తెలిపింది. రిపబ్లిక్ డే పరేడ్ విజయ్ చైక్‌నుంచి నేషనల్ స్టేడియం దాకా సంప్రదాయ రాజ్‌పథ్ మార్గంగుండా సాగుతుందని కూడా ఆ ప్రకటన తెలిపింది.