నేతాజీ విగ్రహం ఏర్పాటు పట్ల కుమార్తె హర్షం

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు  నేతాజీ సుభాస్ చంద్రబోస్ గౌరవార్ధం ఆయన విగ్రహాన్ని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంతోషం వ్యక్తం చేశారు.
 
 ”చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది యువతకు ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ గురించి బాగా తెలుసు. ఆయనను ఎలా గౌరవించాలో కూడా తెలుసు. వారందరికీ కృతజ్ఞతలు. దేశం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సుభాష్ చంద్రబోస్‌‌‌కు ఇండియా గేట్ వంటి ప్రముఖమైన చోట  విగ్రహం ఏర్పాటు చేయడం ఘన నివాళి అవుతుంది” అని అనితా సుభాష్ ఓ ట్వీట్‌లో తన సంతోషాన్ని పంచుకున్నారు.
 
నేతాజీ పాటించిన విలువలు, సిద్ధాంతాలను పునరుద్ధరించి, పటిష్టం చేయడం అన్నిటికంటే ముఖ్యమని ఆమె చెప్పారు. ఉన్నత స్థాయి రాజకీయ నేతలే కాకుండా ప్రతి ఒక్క యువతీయువకుడు బోస్ ఆశయాల కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని ఆమె పేర్కొన్నారు.
 
స్వాగతించిన తృణమూల్ 
 
 కాగా,  దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) స్వాగతించింది.
 
టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుణాల్ ఘోష్ విలేకర్లతో మాట్లాడుతూ ఆయన అదృశ్యమవడం వెనుక అంతుబట్టని కథను వెలుగులోకి తేవడం కోసం కేంద్రం తగిన చర్యలు తీసుకుని ఉంటే, ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అయ్యేదని చెప్పారు.

టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ, కేంద్రం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే గణతంత్ర దినోత్సవాలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన నేతాజీ శకటాన్ని అనుమతించడం హానికరం కాదని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.