బీజేపీలోకి కాంగ్రెస్ పోస్టర్ గర్ల్ ప్రియాంక మౌర్య!

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల వేళ ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ప్రధాన ప్రతిపక్షంపై ఝలక్ ఇచ్చిన బిజెపి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు. ముగ్గురు మంత్రులతో సహా ఓబిసి శాసనసభ్యులు ఎస్పీలో చేరడంలో కొంచెం ఇరకాటంలో పడిన బిజెపిలోకి ఇప్పుడు వలసలు ప్రారంభమైన్నట్లు కనిపిస్తున్నది. 

కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన “లడకీ  హూఁ, లడ్ సక్తీ హూఁ’’ (నేను బాలికను, నేను పోరాడగలను) ప్రచారంలో పోస్టర్ గర్ల్, యూపీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు  డా. ప్రియాంక మౌర్య బీజేపీలో చేరబోతున్నట్లు తెలిసింది. శాసన సభ ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆమె కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. 

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘‘లడకీ హూఁ, లడ్ సక్తీ హూఁ’’ అంటూ ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, పుస్తకాల్లో ప్రియాంక మౌర్య బొమ్మను ముద్రించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని నిలబెట్టుకోలేదని, టిక్కెట్ల పంపిణీలో కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడిందని ఆమె ఆరోపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.  ప్రియాంక మౌర్య ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన కీర్తి, ప్రతిష్ఠలను ఉపయోగించుకుందని చెప్పారు. తనకు సామాజిక మాధ్యమాల్లో 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారని, ప్రచారం కోసం దీనిని కూడా వాడుకుందని ఆరోపించారు.  అయితే టిక్కెట్ల పంపిణీ వరకు వచ్చేసరికి వేరొకరిని ఎంపిక చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

 ఇది చాలా అన్యాయమని, అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం ముందుగానే జరిగిపోయిందని ఆమె ఆరోపించారు. తాను ఓబీసీని (ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని) కావడం, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కార్యదర్శి సందీప్ సింగ్‌కు ముడుపులు ఇవ్వలేకపోయినందువల్లే తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆరోపించారు. 

ఇదిలావుండగా, రాష్ట్రంలో 5 కోట్ల మంది మహిళలకు చేరువకావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గతంలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లను మహిళలకు ఇస్తామని ప్రకటించారు. అంటే మొత్తం 403 స్థానాల్లో 160 స్థానాల్లో మహిళలను పోటీ చేయిస్తామన్నారు.