నితీష్ పార్టీ నేతలపై విసుగుతో బిజెపి హెచ్చరిక

బీహార్ లో ఎన్డీయేలో తమకే అత్యధికంగా సీట్లు వచ్చినప్పటికీ, జెడి(యు)కు తక్కువగా సీట్లు వచ్చినప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నితీష్ కుమార్ నే తిరిగి ముఖ్యమంత్రిగా మద్దతు ఇచ్చిన బిజెపి నేతలకు ఆ పార్టీ నేతల వ్యవహారం నచ్చడం లేదు. తరచూ బిజెపి అధినేతలను చులకనచేస్తూ వారు చేస్తున్న ప్రకటనలకు చికాకు కలిగిస్తున్నాయి. వారి వ్యవహారం పట్ల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహితం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడం అసహనం కలిగిస్తున్నది. 
 
 దానితో ఎవరి హద్దుల్లో వారు ఉండాలని, లేదంటే గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలకు బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోదీని జేడీయూ నేతలు తరుచూ ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తుండడంపై ఆయన పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానితో ట్విట్టర్-ట్విట్టర్ అంటూ ఆడొద్దని హితవు చెప్పారు. 
సినీ రచయిత జయ ప్రకాష్ సిన్హాకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి వెనక్కి తీసుకోవాలంటూ జేడీయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్లు చేసే ట్వీట్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ట్యాగ్ చేస్తున్నారు. చక్రవర్తి అశోకుడిపై సిన్హా చేసిన వ్యాఖ్యల కారణంగా అవార్డు వెనక్కి తీసుకోవాలని జేడీయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి, అశోకుడిని ఔరంగాజేబ్‌ని సమానంగా చూపించడంపై సిన్హాపై సంజయ్ జైశ్వాల్ కేసు కూడా నమోదు చేశారు.
అయితే, జేడీయూ నేతలు ఈ విషయాన్ని పెద్దతి చేయడం, ప్రధాని మోదీని ట్యాగ్ చేసి ట్వీట్లు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.  సోమవారం తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘కూటమి బలంగా, ఎక్కువ రోజులు ఉండాలంటే కూటమిలోని పార్టీల నేతలు ఎవరి పరిమితుల్లో వారు ఉండాలి. ఒక వైపు నుంచే ఇలాంటిది ఆశించడం సమంజసం కాదు” అని స్పష్టం చేశారు.
“రాష్ట్రపతి ఇచ్చిన అవార్డును వెనక్కి తీసుకొమ్మని ప్రధానమంత్రిని డిమాండ్ చేయడం ఏంటి? 74 ఏళ్ల పద్మ అవార్డుల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రెజ్లర్ సుశీల్ కుమార్‌పై హత్యా ఆరోపణలు వచ్చినప్పటికీ అవార్డు వాపసు అంశంలో ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు లేని కారణంగా వెనక్కి తీసుకోలేమని రాష్ట్రపతి తెలిపారు. కాబట్టి మోదీతో ట్విట్టర్ ట్విట్టర్ అంటూ ఆడే ఆటలు ఆపేయండి. లేదంటే బిహార్‌లోని 75 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు సమాధానం చెప్తారు’’ అని హెచ్చరించారు.
బిహార్‌లో ప్రభుత్వాన్ని మంచి వాతావరణంలో శాంతియుతంగా నడిపించాలని, అందుకు ఇరువైపుల నుంచి సహకారం ఉండాలని గుర్తు చేశారు. ఏదైనా సమస్య ఉంటే ఇరు వర్గాలు కూర్చొని తేల్చుకోవాలని కోరారు. అయితే చివరగా 2005కి ముందు ముఖ్యమంత్రి నివాసంలో హత్యలు, కిడ్నాప్‌లు జరిగేవని, ఇప్పుడు అలా మారడం తమకు ఇష్టం లేదంటూ సంజయ్ జైశ్వాల్ చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్లు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.