వైకుంఠ ఏకాదశి దర్శనాలపై నిషేధం విదిస్తారా ?

కరోనా నిబంధనల పేరుతో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై తెలుగు రాష్ట్రాలలో దేవాలయాలలో భక్తులకు నిషేధం విధిస్తుండడం పట్ల విశ్వహిందూ పరిషద్ తెలంగాణ ప్రాంత అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవాలయాల వద్ద కరోనా నిబంధనలు ఆధారంగా దర్శన ఏర్పాట్లు చేస్తామనే ఆలోచన దేవాదాయ శాఖ ఎందుకు చేయడం లేదు?. వేలకోట్ల దేవుడి సొమ్ము జమచేసుకున్న దేవాదాయ శాఖ భక్తులకు కనీస జాగ్రత్త ఏర్పాట్లు చేసి దేవుని దర్శనం కలిగించలేదా ?. అని ఆయన ప్రశ్నించారు. 

ఇతర మతస్థుల పండుగలు, ప్రార్థనా స్థలాల వద్ద అమలు కాని నియమ నిబంధనలు దేవాలయాల వద్ద మాత్రమే ఎందుకు అత్యుత్సాహంగా అమలు చేస్తున్నారని తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలను ఆయన నిలదీశారు. అర్థరాత్రి వరకూ జనం గుమిగూడే వ్యాపార సంస్థలకు వర్తించని కరోనా నిబంధనలు పరమ పవిత్రమైన దేవాలయాలకే వర్ధిస్తాయా  అంటూ విస్మయం వ్యక్తం చేశారు. 

విఐపి దర్శనాలతో రాని కరోనా సాధారణ భక్తులతో వస్తుందా ?. తిరుమల వెంకన్న స్వామి దర్శనాలు సామాన్యునికి దూరం చేస్తున్నారా ?. ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో భక్తులను నిరోధిస్తుంటే ఎ ఒక్క రాజకీయ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు ? అంటూ శశిధర్ ప్రశ్నించారు.

రోగం అర్థం కానప్పుడు దేశంలో లాక్‌డౌన్ కంటే ముందే టిటిడి  దర్శనాలు నిలుపుదల చేస్తే హిందూ సమాజం ఒక్క మాట కూడా మాట్లాడలేదని,  కానీ గడిచిన 2 సంవత్సరాలుగా విఐపి,   సిఫార్సులకే స్వామి వారి దర్శనాన్ని పరిమితం చేస్తే స్వాగతించాలా ?. ఇది సామాన్యుడిని స్వామి వారికి దూరం చేయడం కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన భద్రతా చర్యలు చేపట్టి భక్తులకు అన్ని దేవాలయాలలో దర్శనం ఏర్పాట్లు కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు.  ప్రజల దార్శిక హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.  

నిజంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తుందని ప్రభుత్వాలు భావిస్తే పూర్తిగా లాక్ డౌన్ పెట్టండి, అన్నీ మూసివేయండి, ఎవరికీ అభ్యంతరం లేదని హితవు చెప్పారు. కానీ హిందూ పండుగలు వచ్చినప్పుడే,  దేవాలయాల వద్దనే కరోనా నిబంధనలు అమలు చేసి కరోనాను నిర్మూలిస్తామనే ఆలోచనల నుండి భయటికి రావాలని కోరారు.

 హిందూ పండుగలు అనేక కుల వృత్తులకు జీవనోపాధి కలిగిస్థాయని,  ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాధి కుటుంబాలకు జీవనోపాధి కలిగిస్తాయని చెబుతూ ఈ మాత్రం సోయి గుర్తుంచుకోండని సూచించారు. హిందూ సమాజం తన ధార్మిక విశ్వాసాలపైన జరుగుతున్న దాడులను సమర్ధంగా తిప్పికొట్టాలని శశిధర్ పిలుపిచ్చారు.