కొడాలి నాని, వంగవీటి రాధలకు కరోనా 

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పంజా విసురుతున్నది. తాజాగా పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్యెల్యే, టిడిపి నేత వంగవీటి రాధలకు కరోనా సోకింది.  కరోనా లక్షణాలతో నాని  పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది. దీంతో హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో చేరారు. మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు
 
మరోవైపు  వంగవీటి రాధా కూడా కరోనా స్వల్ప లక్షణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం రాధాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామన్నరాష్ట్ర  ప్రభుత్వం వెంటనే వెనక్కు తగ్గింది. 24 గంటల వ్యవధిలోనే కర్ఫ్యూ నిబంధనల జీవోను రెండుసార్లు మార్చింది. తొలుత మంగళవారం నుంచే కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మంగళవారం ఉదయం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కారు.. సాయంత్రానికి నిర్ణయం మార్చుకుంది.
సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజల ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. సంక్రాంతి తర్వాత 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు తాజాగా పేర్కొంది.
 
రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం రాష్ట్రంలో 984 కరోనా కేసు లు నమోదు కాగా.. ఒక్కరోజులోనే ఆ సంఖ్య దాదాపు రెట్టింపైంది. దీంతో యాక్టివ్‌ కేసులు 7,195కు పెరిగిపోయాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 36,452 పరీక్షలు చేయగా 18,31 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.