కరోనా బారిన నితీష్, బొమ్మై, నడ్డా

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ లతో పాటు మరో కేంద్ర మంత్రి అజయ్ భట్ కరోనా బారిన పడగా,  తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, ఆయన భార్య బృందా కారత్ కూడా కరోనాకు గురయ్యారు. 
 
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం ఆఫీస్ అధికారులు వెల్లడించారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ ఇంట్లోనే ఐసోలేట్ అయి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నారని వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
 
 బసవరాజు బొమ్మె తాను కరోనా బారిన పదిన్నల్టు తన  అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగేఉందని, వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.  ఇటీవల తననుకలిసిన వారంతా కోవిడ్‌ టెస్టులు చేయించుకొని హోం ఐసోలేషన్‌లో ఉండాలని విజ్జప్తి చేశారు. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపిన నడ్డా.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేసుకోవాలని సూచించారు.
 
హైదరాబాద్ లో జరిగిన సీపీఎం జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ప్రకాష్ కారత్, బృందాకారత్‌లు సైతం కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. వీరిలో కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీరిరువురు ఐసొలేషన్‌లో ఉన్నారు.