నీట్‌లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాకు సుప్రీం అనుమతి

మెడికల్‌ ఆలిండియా కోటా సీట్లలో ఓబీసీలు, అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. నీట్‌ పీజీ – 2021, నీట్‌ యూజీ – 2021 అడ్మిషన్ల ప్రక్రియలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయవచ్చని పేర్కొంది. రిజర్వేషన్లపై ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విధివిధానాలను అనుసరించి అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. 

ఈ మేరకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి రిజర్వేషన్లకు అనుమతిస్తూ, కౌన్సెలింగ్‌లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న పాండే కమిటీ సిఫార్సులతో ఏకీభవిస్తున్నామని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. దీంతో 2021-22 విద్యా సంవత్సరానికి నీట్‌ పీజీ, యూజీ కౌన్సెలింగ్‌కు లైన్‌ క్లియర్‌ అయింది.

 ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలను గుర్తించడానికి కేంద్రం అనుసరిస్తున్న విధానంపై తుది విచారణను మార్చి మూడోవారంలో చేపతామని కోర్టు స్పష్టం చేసింది. కుటుంబ వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ రూ.8లక్షల పరిమితిని కొనసాగించాలన్న పాండే కమిటీ సిఫార్సుపై… తుది తీర్పునకు లోబడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. 

కోర్టులో రెండ్రోజులపాటు వాదనలు జరిగిన నేపథ్యంలో ఈ అంశంపై అన్ని వివరాలతో ఉత్తర్వులను ఇవ్వాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కోర్టు ఆదేశాలపై ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది.  మెడికల్‌ ఆలిండియా కోటా సీట్లలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు రిజర్వేషన్లను అమలుచేయాలని గత జూలైలో కేంద్రం నిర్ణయించింది. చిన సంగతి తెలిసిందే.

 దీన్ని సవాలు చేస్తూ కొంతమంది విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణ నేపథ్యంలో కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం జరగడాన్ని నిరసిస్తూ రెసిడెంట్‌ డాక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో త్వరగా విచారించాలన్న కేంద్రం అభ్యర్థన మేరకు తాజా తీర్పు వెలువడింది. కాగా, నీట్‌ యూజీ ఎవాల్యుయేషన్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆరుగురు అభ్యర్థులు దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదావేసింది.