
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను ఎట్టకేలకు కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాఘవను పోలీసులు కొత్తగూడెంకు తరలిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ నిందితుడిగా ఉన్నారు. రాఘవ ఆకృత్యాలపై శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చాయి.
ఈ తరుణంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు బహిరంగ లేఖ రాశారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని తెలిపారు. తన కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటానని లేఖలో పేర్కొన్నారు. పార్టీకి నియోజకవర్గానికి రాఘవేంద్రను దూరం పెడుతానని చెప్పారు.
మృతుడు రామకృష్ణ సెల్ఫీ వీడియోలో దారుణమైన విషయాలు వెలుగు చూడడంతో రాఘవ అరెస్ట్ తప్పలేదు. రాఘవ తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడాడని రామకృష్ణ తెలిపాడు. ‘‘నా ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని నా భార్యను హైదరాబాద్ తీసుకుని రమ్మని రాఘవ చెప్పాడు” అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు.
“నిన్ను అన్ని విధాల కాపాడుకుంటానని ప్రమాణం చేసి తనను రాఘవ దగ్గరకు ఎలా పంపగలను? రాఘవ డబ్బులు అడిగినా ఇచ్చేవాడిని కానీ నా భార్యను కోరుకున్నాడు. అది ఎలా ఇవ్వగలను? నేను ఒక్కడినే చనిపోదామనుకున్నా.. కానీ ఆ తరువాత కూడా నా భార్య పిల్లలకు ఇబ్బందులు తప్పవని నాతోనే వాళ్లని కూడా తీసుకుని వెళ్ళిపోతున్న” అంటూ అందులో ఆవేదన వ్యక్తం చేసాడు.
“నీ భార్యను నా దగ్గరకు పంపు.. లేకపోతే నీ సమస్య పరిష్కారం కాదు.. నీ ఆస్తి నీకు రాదు.. నిన్ను ఎవరూ కాపాడలేరు’ అని రాఘవ బెదిరించాడు. అందుకే ఈ ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నా. నాకు నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తిని అమ్మి ఎవరికీ అన్యాయం జరగకుండా అప్పులు చెల్లించండి. నేను కష్టాల్లో ఉన్నానని తెలిసి నా తల్లి, అక్క సైతం వేధింపులకు పాల్పడ్డారు’’ అని ఆ వీడియోలో తన దుస్థితి గురించి వాపోయాడు.
ఈ విషయమై సొంత పార్టీ వారి నుండి కూడా వత్తిడి వస్తుండడం, వనమా వెంకటేశ్వరరావు రాజీనామాకు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో రాఘవను అరెస్ట్ చేయక ప్రభుత్వానికి తప్పలేదని తెలుస్తున్నది.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత