ఎంపీ అరవింద్‌ను అరెస్ట్‌ చేయొద్దన్న హైకోర్టు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో బీజేపీ నేత, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అరవింద్‌ను అరెస్ట్‌ చేయవద్దంటూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. 
 
 గత అక్టోబరు 31న హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో తీన్మార్‌ మల్లన్నను పరామర్శించిన తర్వాత ధర్మపురి అరవింద్‌ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు ఎస్సీ, ఎస్టీలను కించపరిచేలా ఉన్నాయంటూ బంగారు సాయిలు అనే సామాజిక కార్యకర్త ఇటీవలే నిజామాబాద్‌ ఐదో టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు కేసును చంచల్‌గూడ పరిధిలోని మాదన్నపేట పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో మాదన్నపేట పోలీసులు ఎంపీ అరవింద్‌పైౖ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసును కొట్టేయాలని ఎంపీ అరవింద్‌ హైకోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున బీజేపీ మాజీ ఎమ్మెల్సీ, న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపించారు. అరవింద్‌ వాడిన లొట్టపీసు అనే పదం ఓ సామాజిక వర్గాన్ని కించపర్చేలా ఉన్నదన్న ఆరోపణపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. 
 
లొట్టపీసు అంటే ఔషధ గుణాలు కలిగిన ఓ మొక్క పేరని.. ఎవరిని కించపర్చే వ్యాఖ్య కాదని పేర్కొన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అట్రాసిటీ కేసు పెట్టారని న్యాయమూర్తికి వివరించారు. పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 
 
ప్రస్తుతానికి కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని చెప్పిన ధర్మాసనం.. పిటిషనర్‌ను అరెస్ట్‌ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఎంపీగా ఉన్న పిటిషనర్‌.. మాట్లాడేటప్పుడు జాగ్త్రత్తగా ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.