సరైన భద్రత లేని కారణంగా వెనుదిరిగి వెళ్లిపోతూ “ప్రాణాలతో వెళుతున్నాం అంటూ మీ సీఎంకు ధన్యవాదాలు” అంటూ ట్విట్టర్ లో ప్రధాని పోస్ట్ చేయడం ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీని ఇరకాటంలో పడవేసింది. అసలుకే భద్రతా పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పంజాబ్ లో, దేశ సరిహద్దుకు 10 కిమీ దూరంలో ప్రధానికి భద్రతా కల్పించలేక పోవడం ఆందోళన కలిగిస్తుంది.
దానితో ప్రధాని భద్రతకు తన ప్రాణాలైనా అడ్డు పెడతానని నాటకీయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి నష్ట నిరావణ చర్యలకు దిగిన్నట్లు కనిపిస్తున్నది. దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది.
జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం అఫైర్స్) అండ్ జస్టిస్ అనురాగ్ వర్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కేవలం ఉన్నత పోలీస్ అధికారులకు మాత్రమే తెలిసిన ప్రధాని పర్యటన మార్గం వివరాలు ఉద్యమించిన రైతులకు ఎవ్వరు `లీక్’ చేశారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారుతున్నది.
ఉద్దేశ్య పూర్వకంగానే భద్రతా వైఫల్యాలు ఉన్నాయా? అని ప్రశ్న తలెత్తుతుంది. నిరసనలు జరుగుతున్నట్లు నిఘా నివేదికలు స్పష్టం చేస్తున్నా ప్రధాని మార్గం ఎందుకు మార్చలేదనే ప్రశ్న ఎదురవుతుంది.
కొద్దీ నెలల క్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నవజ్యోత్ సింగ్ సిద్దును నియమించడం భద్రతా పరిస్థితుల దృష్ట్యా ప్రమాదకరమని తాను హెచ్చరించినా కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోలేదని చెప్పడం గమనార్హం.
పాకిస్థాన్ ప్రధాని, సైన్యాధిపతి వంటి వారితో సన్నిహిత సంబంధాలు గల అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయాలని చూస్తున్నారని కూడా ఆయన హెచ్చరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రిపై కూడా కీలక పోలీస్ అధికారుల నియామక విషయమై సిద్దు తీవ్రమైన వత్తిడులు తీసుకు రావడం బహిరంగ రహస్యమే.
పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధానమంత్రిని “భౌతికంగా దెబ్బతీయడానికి ప్రయత్నించింది” అని బిజెపి నాయకులు ఆరోపించడం, ఇతర పార్టీలు కూడా శాంతిభద్రతల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేయడంతో ఈ సంఘటన పెద్ద రాజకీయ వివాదంగా మారుతున్నది.
మరోవంక, బిజెపి పంజాబ్ అధ్యక్షుడు అశ్వని శర్మ నాయకత్వంలో ఆరుగురు ప్రతినిధుల బృందం నేడు రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కలిసి ఈ విషయంపై వినతిపత్రం సమర్పించనున్నారు. పంజాబ్‌లో ప్రధాని భద్రతా ఉల్లంఘన ఘటనకు సంబంధించి బిజెపి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నది. దీనిని ‘పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయి’ అని ఆ పార్టీ అభివర్ణించింది.

More Stories
షాహీన్‌కు పుల్వామా దాడి సూత్రధారి భార్యతో సంబంధాలు!
పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు
ఉగ్రకుట్రకు అడ్డాగా అల్ ఫలాహ్‌లో 17వ నంబర్ భవనం