పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి .. పోలీసు విఫలం

పంజాబ్‌ రాష్ట్రం సురక్షితంగా ఉండాలన్నా, శాంతి భద్రతలను కాపాడాలన్నా అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. రోడ్ల దిగ్బంధంతో ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పైనే ఉండిపోవాల్సి రావడంపై పంజాబ్‌ సర్కార్‌ను ఆయన తప్పుపట్టారు. 
 
ఇది తీవ్రమైన భద్రతా లోపమేనని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని ఆరోపించారు. ”ప్రధానికి సురక్షితంగా ప్రయాణించడానికి వీలు కల్పించలేకపోతే, అందులోనూ పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ప్రధానికి రక్షణ కల్పించ లేకుంటే మీరు మీ పదవిలో కూర్చునేందుకు తగరు. వెంటనే పదవి నుంచి తప్పుకోండి” అని ముఖ్యమంత్రి, హోం మంత్రిలపై మీడియా సమావేశంలో కెప్టెన్ విరుచుకుపడ్డారు.

కాగా, భద్రతా వైఫల్యంపై పూర్తి నివేదిక అందించాలని పంజాబ్ అధికారులనుకేంద్ర హోంమంత్రి అమిత్ షా  ఆదేశించారు. భద్రతా వైఫల్యం సహించరానిదని స్పష్టం చేశారు. భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఇలా ఉండగా, ప్రధాని పర్యటనలో భద్రతా లోపం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇది ‘పంజాబియత్’కు (పంజాబీ సంప్రదాయాలకు) విరుద్ధమని  సీనియర్ నేత సునీల్ జాఖర్ స్పష్టం చేశారు. 

‘ఇవాళ ఏదైతే జరిగిందో అది ఆమోదయోగ్యం కాదు. పంజాబీయత్‌కు వ్యతిరేకం. ఫిరోజ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ రాజకీయ ర్యాలీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా మోదీ వెళ్లేలా చూడాల్సింది. ప్రజాస్వామ్యం గొప్పతనమే అది” అని పంజాబ్ కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షుడు జాఖర్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

 ఇది కుట్రేనని, బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి, పంజాబ్ బీజేపీ ఇన్‌చార్జి గజేంద్ర సింగ్ షెకావత్ మండిపడ్డారు. జూనియర్ అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేసారు. 

‘బ్లూ బుక్’ నిబంధనలలో విఫలం

పంజాబ్ పోలీసులు ‘బ్లూ బుక్’ నిబంధనలను అనుసరించడంలో విఫలమయ్యారని, నిరసనకారుల గురించి ఇంటెలిజెన్స్ సమాచారం అందించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేయలేదని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి చెప్పారు.స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) బ్లూ బుక్ ప్రధానమంత్రి రక్షణ కోసం భద్రతా మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది.

బ్లూ బుక్ ప్రకారం ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా పంజాబ్‌లో జరిగిన ప్రతికూల పరిస్థితుల్లో, రాష్ట్ర పోలీసులు వీఐపీ రక్షణ కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేయాలని హోంశాఖ అధికారి చెప్పారు. పంజాబ్ పోలీసు అధికారులు వీఐపీకి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చి విఫలమయ్యారని కేంద్ర అధికారి పేర్కొన్నారు.స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సిబ్బంది ప్రధానమంత్రికి దగ్గరగా ఉంటారు, మిగిలిన భద్రతా చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. 

ఏదైనా ఆకస్మిక పరిణామాలు ఏర్పడిన సందర్భంలో రాష్ట్ర పోలీసులు వీఐపీల కదలికలను తదనుగుణంగా మార్చాలని అధికారి వివరించారు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా పంజాబ్ పోలీసులు చేపట్టిన బందోబస్తు, పికెట్లు, రూఫ్‌టాప్ లపై జవాన్ల మోహరింపు, బారికేడ్‌ల ఏర్పాటు ఇతర భద్రతా చర్యల వివరాలను పంపించాలని కేంద్ర హోంశాఖ బృందం కోరింది. 

ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో నవంబరు 4వతేదీన దాచిన పేలుడు పదార్థాలు నింపిన టిఫిన్ బాక్స్‌ను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ ఘటనను తీవ్రమైన భద్రతా లోపంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీనిపై పంజాబ్ ప్రభుత్వం నుంచి వివరణ నివేదికను కోరింది. 

ఈ లోపానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.ప్రధానమంత్రి వెళ్లే మార్గం కేవలం పంజాబ్ పోలీసులకు మాత్రమే తెలుసని, ఇలాంటి పోలీసుల ప్రవర్తన ఎప్పుడూ చూడలేదని కేంద్ర హోంశాఖ అధికారి వ్యాఖ్యానించారు.