తెలంగాణలో కరోనా ఉధృతం … రంగంలోకి హైకోర్టు

తెలంగాణలో కరోనా ఉధృతం … రంగంలోకి హైకోర్టు
తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి ఉధృత రూపం దాలుస్తుంది.  గడిచిన 24 గంటల్లో 42,991 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ బులెటిన్ వెల్లడించింది.. అలాగే ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దానితో కరోనా పరిస్థితులనే తామే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది.
గత ఆరునెలలుగా తక్కువ సంఖ్యలో నమోదైన కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమైయ్యారు. తాజాగా జిహెచ్‌ఎంసి పరిధిలోనే 659, రంగారెడ్డిలో 109 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 116 కేసులు నమోదైయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,84,023కి చేరింది.
ఇక గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 4,033కి చేరింది. కరోనా బారి నుంచి సోమవారం 240 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,858 ఐసోలేషన్, యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,84023కి చేరింది.
రాష్ట్రంలో ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుంటే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వారం కింద వరకు రెండొందలు దాటని కరోనా రోజువారీ కేసులు ఇప్పుడు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి.
 
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 94కి చేరింది. అలాగే 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి 127మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి చేరకున్నారు. వారందరికీ కరోనా ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేయగా 8మంది ప్రయాణీకులకు పాజిటివ్‌గా తేలింది. 
 
పర్యవేక్షింపనున్న హైకోర్టు 
 
ఇలా ఉండగా, రాష్ట్రంలో కరోనా పరిస్థితులను తాము ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని రాష్ట్ర హైకోర్టు మంగళవారం పేర్కొంది. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
 
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, చికిత్స, మౌలిక సదుపాయాలు, వసతులు తదితర అంశాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ షావిలి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. 
 
పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ… రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు వర్చువల్‌ విచారణ చేపట్టాలని కోరారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ నివేదికను అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనానికి సమర్పించారు. 
 
ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నామని నివేదించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం రాష్ట్రంలో పరిస్థితులపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో  కరోనా  పరిస్థితులను పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చింది.