కేసులు భారీగా పెరిగితే వైద్య వ్యవస్థపై భరించలేనంత భారం

ఒమైక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపించగలదని, దానివల్ల కేసులు భారీగా పెరిగితే వైద్య వ్యవస్థపై భరించలేనంత భారం పడే ముప్పు ఉందని  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వైద్య యంత్రాంగాలను సమాయత్తం చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. 
 
15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌పై ఆదివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ  పిల్లలకు వ్యాక్సినేషన్‌ సోమవారం (జనవరి 3) నుంచి ప్రారంభమవనున్న నేపథ్యంలో టీకా కేంద్రాల నిర్వహణలో అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్రాలు, యూటీలకు మన్‌సుఖ్‌ మాండవీయ సూచించారు.
 
పిల్లలకు కేవలం ‘కొవ్యాక్సిన్‌’ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. వాటిలో ఇతర టీకాలు కలిసిపోకుండా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. ఇందుకోసం పిల్లలకు ప్రత్యేక టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒకవేళ పెద్దలకు టీకాలు వేసే చోటులోనే పిల్లల వ్యాక్సినేషన్‌ కేంద్రం కూడా ఉంటే.. పిల్లల కోసం వేరుగా క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 
 
టీకా మొదటి డోసు వ్యాక్సినేషన్‌ను సగటున 90 శాతం పూర్తి చేసినందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన అభినందించారు. కొవిడ్‌ అత్యవసర నిధి కింద కేటాయించిన ‘ఈసీఆర్‌పీ-2’ నిధుల వ్యయంలో పొదుపుగా వ్యవహరించి 17 శాతమే ఖర్చు చేయడాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల  ఐకమత్యానికి నిదర్శనంగా కేంద్ర ఆరోగ్య మంత్రి అభివర్ణించారు. 
 
మరోవంక, భారత్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ కరోనా  కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1700 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 639 మంది ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నారు. 
 
23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 510, ఢిల్లీలో 351, కేరళ 156, గుజరాత్ 136, తమిళనాడు 121, రాజస్థాన్ 120, తెలంగాణ 67, కర్ణాటక 64, హర్యానా 63 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ఇక, కరోనా ఉధృతి నేపథ్యంలో దేశంలోని వైద్యులకు కరోనా  చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)తో కేంద్రం జట్టుకట్టింది. సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రాల్లోని జిల్లాస్థాయి కొవిడ్‌ చికిత్సా కేంద్రాల ఇన్‌చార్జిలు, కాంటింజెంట్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు (సీడీఎంవో), ప్రభుత్వ, ప్రైవేటు చికిత్సా కేంద్రాల వైద్యులకు జనవరి 5 నుంచి 19 వరకు వెబినార్‌లు నిర్వహించనుంది. 
 
కాగా, పిల్లల వ్యాక్సినేషన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా 6.35 లక్షల మందికిపైగా పిల్లలు తమ వివరాలను నమోదు చేసుకున్నారు.