ముంబైలో కరోనా -టెలిఫోన్‌ స్కామ్‌

మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై వాసులందరినీ కొత్తగా బైటపడిన కరోనా -టెలిఫోన్‌ స్కామ్‌ గురించి హెచ్చరిస్తూ జాగ్రత్త పడమని కోరుతోంది. ముంబైలో నివాసం ఉంటున్న వారికి ఒక సెల్‌ఫోన్‌ మెసేజ్‌ వస్తుంది. 
 
అందులో సదరు వ్యక్తికి కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులూ పూర్తయిన సంగతి, ఆ వ్యాక్సిన్‌ ఏయే తేదీలలో వేయిచుకున్నది, ఏ కేంద్రంలో వేయించుకున్నది వివరాలు ఉంటాయి. అది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది గనుక దానిని విశ్వసిస్తారు.
ఆ తర్వాత ఆ వ్యక్తికి మూడో బూస్టర్‌ డోసు ఉచితంగా వేయబడుతుందని, కావాలనుకుంటే పేరు నమోదు చేసుకోవాలని సమాచారం వస్తుంది. అప్పుడు గనుక ఆ వ్యక్తి తన పేరు నమోదు చేయించుకున్నాడా ఇక ఇరుక్కున్నట్టే.
ఆ తర్వాత ఆ వ్యక్తికి ఒక ఓటిపి నంబరు వస్తుంది. కాసేపట్లో ఫోన్‌ కాల్‌ వస్తుంది. ఈ ఓటిపి నంబరు చెప్పమని అడుగుతారు. ఈ వ్యక్తి గనుక ఆ నెంబరు చెప్తే క్షణాల్లో అతని బ్యాంక్‌ అకౌంట్‌ నుండి భారీ మొత్తం మాయం అవుతుంది.
 మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎటువంటి ఉచిత, మూడవ బూస్టర్‌ డోసునూ వేయడంలేదని, అధికారికంగా రాని ఏ సమాచారాన్నీ విశ్వసించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా సీనియర్‌ సిటిజెన్స్‌ జాగ్రత్తపడాలని హెచ్చరిస్తోంది. ఈ తరహా స్కాములకు దేశంలో పలు ఇతర ప్రాంతాలలో కూడా వెలుగు చూస్తున్నాయి.