రాష్ట్ర పోలీస్ లో కలుపు మొక్కలు ఏరిపారవేయాలి 

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలంటే అందులోని కలుపు మొక్కలను ఏరిపారేయాల్సిన అవసరం ఉందని వైసిపి ఎమ్యెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. గతంలో కంటే నక్సలిజం, ఉగ్రవాదం తగ్గినా లోకల్ మాఫియా మాత్రం పేట్రేగిపోతుందని విమర్శించారు. 

పైగా, ఈ మాఫియాతో పోలీసుశాఖ వాళ్లు కూడా కలిసిపోయారంటూ ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం పోలీసుశాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం లోకల్ మాఫియా ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయని ఆగ్ర‌హం వ్యక్తంచేశారు.

ఈ మాఫియాలు ఇప్పుడే కాదని, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయని పేర్కొన్నారు. వీళ్లు ప్రజలకు గుదిబండలా తయార‌య్యార‌ని ధ్వజమెత్తారు. ఈ మాఫియాల్లో పోలీసుశాఖ వాళ్ల ఇన్వాల్వ్ మెంటు కూడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొంతకాలంగా, వైసిపి నాయకత్వం పట్ల అసంతృప్తితో వ్యవహరిస్తున్న మాజీ ఆర్ధిక మంత్రి  మాఫియాతో చేతులు కలిపితే పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని హెచ్చరించారు. ఇప్పటికే పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం, భరోసా ఉందని చెబుతూ అలాంటిది పోలీసులే మాఫియాతో కలిస్తే సామాన్యులకు భద్రతేమి ఉంటుందని రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు.