తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార సాధనకు మొత్తం 19 ఎస్సీ సీట్లలో గెలుపొంది సత్తా చాటేలా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కేడర్‌కు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. మంగళవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఎస్సీ స్థానాలపై పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన అంతర్గత వర్క్‌షాప్‌లో ముఖ్య అంశాలపై సమాలోచనలు జరిపారు.
ఈ సీట్లపై ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారించి, గెలుపొందేందుకు ప్రణాళికలు రూపొందించడం కోసం `మిషన్-19′ పేరుతో వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ దళిత సీఎం మొదలు దళితబంధు వరకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
దళితులంతా బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని చెబుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారంలోకి రావడమే పార్టీ అంతిమ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇది నెరవేరాలంటే ఎస్సీ సీట్లలో గెలుపు చాలా కీలకం అని చెప్పారు. “ఎస్సీ స్థానాలపై స్పెషల్ ఫోకస్‌గా మిషన్–19 పేరుతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. దీనికి అనుగుణంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. నియోజకవర్గ స్థాయిలోనూ సమస్యలను గుర్తించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి’ అని సూచించారు.
కాంగ్రెస్ 2009లో 10 ఎస్సి సీట్లను గెలుపొందడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అదే విధంగా 2014లో 13 ఎస్సి, 2018లో 16 సీట్లను గెల్చుకోవడం ద్వారా టి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చినదని ఆయన గుర్తు చేశారు. ఈ నియోజకవర్గాలలో పార్టీ నిర్వహించిన సర్వేలో బీజేపీ పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్నదని చెప్పారు.
అయితే ఆ సానుభూతిని ఓట్లుగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎస్సి నియోజకవర్గాలకు పార్టీ పరిశీలకులను నీయమిస్తున్నామని చెబుతూ వారు జనవరి 5 నుండి 25 వరకు ఆయా నియోజకవర్గాలలో పర్యయంచాలని కోరారు. పాదయాత్రలు జరపడం, స్థానిక సమస్యలపై ఆందోళనలు జరపడం చేయాలని సూచించారు.
కార్యక్రమంలో నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎ.చంద్రశేఖర్, జి.విజయరామారావు, జి.వివేక్ వెంకటస్వామి, రవీంద్ర నాయక్, ఎస్.కుమార్, ప్రేమేందర్‌రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, బంగారు శ్రుతి, జి.మనోహర్‌రెడ్డి, కొప్పు భాషా పాల్గొన్నారు.

More Stories
స్థానిక ఎన్నికలపై హైకోర్టు కోసం ఎదురుచూపు!
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు: