ఫ్రాన్స్ లో తొలిసారి లక్షకు పైగా కరోనా కేసులు

ఫ్రాన్స్ లో తొలిసారి లక్షకు పైగా కరోనా కేసులు
కరోనా కాలంలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్‌లో ఒక్క రోజులో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. గత నెల రోజుల్లో కోవిడ్‌తో ఆస్పత్రుల పాలైనవారి సంఖ్య రెట్టింపయింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాలా వేగంగా విస్తరిస్తుండడంతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం కొత్తగా లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
 
గత వారంలో పారిస్‌లో ప్రతి వందమందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే కొత్తగా వచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌వే. రాబోయే రోజుల్లో దీని ప్రభావం కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
 
బ్రిటన్‌లో ఇప్పటికే ఒమిక్రాన్‌ పెచ్చరిల్లింది. డెల్టా వేరియంట్‌ కేసులు కూడా ఇటీవల పెరుగుతున్నాయి. వీటిలో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. క్రిస్మస్‌ శలవుల్లో ఐసియులపై ఒత్తిడి పెరిగింది. ఫ్రాన్స్‌లో గత వారంలో వెయ్యి మందికి పైగా వైరస్‌తో మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,22,000 దాటింది. 
 
వైరస్‌ను ఎలా అదుపు చేయాలనే అంశంపై చర్చించేందుకు సోమవారం అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ అత్యవసర సమావేశం జరిపారు. తిరిగి కర్ప్యూ విధించడమో లేదా పాఠశాలలకు శలవులు పెంచడమో చేయాలని నిపుణులు కోరుతున్నారు. 
 
కానీ అనుకున్న ప్రకారం జనవరి 3నే పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ఫ్రాన్స్‌ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. దీనికి బదులుగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను పెంచితే సరిపోతుందని అంటున్నారు. పొరుగున వున్న బెల్జియంలో సినిమా హాళ్ళు, కచేరీ హాల్స్‌తో సహా సాంస్కృతిక వేదికలన్నీ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఆస్ట్రేలియాలో మొదటి ఓమిక్రాన్ మృతి 
 
ఆస్ట్రేలియాలో మొదటి ఒమిక్రాన్‌ మృతి కేసు నమోదైంది. వృద్ధాశ్రమంలో ఉంటున్న 80 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌ బారినపడ్డారని, పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారని అన్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన మరే ఇతర వివరాలు అందించలేదు. 
 
రోజువారీ కేసులు కూడా అధిక సంఖ్యలో పెరుగుతున్నాయని, అయితే ఆస్పత్రుల్లో చేరే వారి రేటు తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్‌ గత వేరియంట్‌ల కన్నా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. తీవ్రత తక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొనడంతో దేశీయ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేశారు. 
 
అలాగే విదేశాల నుండి వచ్చే వారిని కూడా క్వారంటైన్‌ లేకుండా అనుమతిస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే దేశంలో లాక్‌డౌన్‌ దిశగా వెళ్లే పరిస్థితులు లేవని, కానీ కొన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా 11,500 విమానాలు రద్దు 

సాధారణంగా క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా విమానాశ్రయాలు అత్యంత రద్దీగా మారుతుంటాయి. అయితే అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విరుచుకుపడటంతో.. వారాంతంలో ప్రపంచవ్యాప్త విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు సిబ్బంది కొరత వేధిస్తోంది. 

శుక్రవారం నుండి ప్రపంచవ్యాప్తంగా సుమారు 11,500 విమానాలు రద్దయ్యాయి. మరో పదివేల విమానాలు ఆలస్యం అయ్యాయని విమాన సంస్థలు తెలిపాయి. ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల సిబ్బంది కొరతకు దారితీసిందని వెల్లడించాయి. దీంతో సిబ్బంది కొరతను తగ్గించేందుకు యుఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ స్వల్ప లక్షణాలున్న కరోనా బాధితుల క్వారంటైన్‌ను 10 రోజుల నుండి ఐదు రోజులకు తగ్గించింది.