కేటీఆర్ విమర్శలు నిరుద్యోగులను అవమానించడమే

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం తలపెట్టిన నిరుద్యోగ దీక్షను విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాయడంపై బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభా పక్ష నాయకుడు రాజాసింగ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన విమర్శలు ముమ్మాటికీ నిరుద్యోగులను అవమానించడమేనని ధ్వజమెత్తారు.

అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగులను ఊరిస్తున్నారే తప్ప ఎలాంటి ఉద్యోగాలు కల్పించడం లేదని ఆయన విమర్శించారు. కేటీఆర్ లేఖలోని విమర్శలకు తిప్పికొడుతూ  రాజాసింగ్ మంత్రి కేటీఆర్ కు మరో  బహిరంగ లేఖ  వ్రాసారు. 

లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల్లేక అల్లాడుతున్నారని,  ఇప్పటి వరకు దాదాపు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆ లేఖలో విమర్శించారు. నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి  కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చేందుకు ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతుంటే ఉద్యోగాల నోటిఫికేషన్ ఎఫ్పుడిస్తారో చెప్పకుండా నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. 

“తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊరించింది మీరు కాదా? తెలంగాణ వచ్చాక అసెంబ్లీ సాక్షిగా 1 లక్షా 7 వేల ఉద్యోగాలున్నాయని చెప్పింది సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా? ఈ ఏడేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా విడుదల చేయని మాట నిజం కాదా? రెండో సారి అధికారం చేపట్టాక గత మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ను కూడా విడుదల చేయని మాట వాస్తవం కాదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ (పీఆర్సీ కమిటీ)యే తెలంగాణలో 1 లక్షా 92 వేల శాంక్షన్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చి చెప్పిన మాటను ఆయన గుర్తు చేసారు. ఈ ప్రశ్నలన్నీ  సంధించబోతున్నామని తెలిసి, నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని రాజాసింగ్ దుయ్యబట్టారు.

“మేం ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నిస్తుంటే… మీరు ప్రైవేటు ఉద్యోగాల గురించి మాట్లాడటం విడ్డూరం… ఏటా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది.  కేంద్ర ప్రభుత్వ విధివిధానాలతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఏవైనా అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించిందా?” అని నిలదీశారు.

కేంద్రం తెచ్చిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల కారణంగా రాష్ట్రానికి అంతర్జాతీయ సంస్థలు వచ్చాయే తప్ప మీరు ఉద్దరించేదేమీ లేదనేది నిజం కదా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరేవర్చాలని బిజెపి డిమాండ్ చేస్తుంటే కేంద్రం గురించి, పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతూ సమస్యను దారి మళ్లించాలనుకోవడం ప్రభుత్వ  అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా క్రమం తప్పకుండా యూపీఎస్సీ, బీఎస్సార్బీ, ఆర్ఆర్ బీ, ఎస్ఎస్ సీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తదితర సంస్థల ద్వార లక్షలాది  ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ఉందని గుర్తు చేసారు. సెంట్రల్ వర్శిటీతోవ పాటు కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏర్పడే  ఖాళీలను వెంట వెంటనే భర్తీ చేయడం జరుగుతోందని చెప్పారు.

ఈ ఏడేళ్లలో ఏ ఒక్క విశ్వవిద్యాలయంలోనైనా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ లో ఒక్క పోస్టునైనా కేసీఆర్ భర్తీ చేశారా? అని రాజాసింగ్   అడిగారు.  తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్ అనే పదమే ఉండదని అసెంబ్లీ, అనేక వేదికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారని గుర్తు చేశారు. కాని నిర్దాక్షిణ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులందరిని తొలగంచి రోడ్డున పడేస్తారని అనుకోలేదని చెప్పారు. 

ఇప్పటిదాకా దాదాపు 50 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’తో మీ ప్రభుత్వం నిరుద్యోగ యువతీ, యువకులకు చేసిన ద్రోహం బట్టబయలవుతుందని, తద్వారా మీ పీఠం కదులుతుందనే భయంతోనే బహిరంగ లేఖ పేరుతో ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు.