పేదలకు న్యాయం అందించడమే అంతిమ లక్ష్యం

పేదలకు న్యాయం అందించడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. హైదరాబాద్‌లోని నల్సార్‌ విశ్వవిధ్యాలయం 18వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరవుతూ భాష ఏదైనా సమాచార మార్పిడి సమర్థంగా, ఆకర్షణీయంగా ఉండాలని సూచించారు.
 
న్యాయవాద వృత్తిలో రాణించాలంటే దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాహిత్యం, చరిత్ర తెలిసి ఉండాలని సూచించారు. అంతిమంగా నిజం రాబట్టడానికి ప్రశ్నించేతత్వాన్ని మరవొద్దని హితవు పలికారు. 
హక్కులు, న్యాయం కోసం పోరాడేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తమ శక్తిని వినియోగించుకునే మార్గమే యువత భవిష్యత్తును నిర్ధేశిస్తుందని పేర్కొన్నారు. న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషి చేయాలని ఆయన కోరారు. న్యాయ విద్యార్థులు క్షేత్ర స్థాయిలో ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.
 
నల్సార్‌ విశ్వవిద్యాలయంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెబుతూ  బర్కత్‌పురాలో చిన్న భవనంలో ప్రారంభమైన కళాశాల నేడు అత్యున్నత స్థాయికి ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర , న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తదితరులు స్నాతకోత్సవానికి హాజరయ్యారు.
కాగా, దేశవ్యాప్తంగా పెండింగ్ కేసులు పరిష్కరించాలంటే కోర్టులను ఆధునీకరించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. అంతకు ముందు  హన్మకొండలోని వరంగల్ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో రూ.23 కోట్ల వ్యయంతో నిర్మించిన టెన్ కోర్టు భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 
 
ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో జస్టిస్ ఎన్‌వి రమణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల కొరతతో పాటు కోర్టుల్లో సౌకర్యాలు లేకపోవడంతో పెండింగ్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాల్సి ఉందని, పలు రాష్ట్రాలు తనవంతు నిధులను కేటాయించడంలో నిర్లక్షం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టుల ఆధునీకరణకు వరంగల్ నూతన టెన్ కోర్టు భవనాన్ని మాడల్‌గా తీసుకొని ఆధునీకరించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈకోర్టు భవనంలో ఫోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టుల నమూనాలను దేశ వ్యాప్తంగా ఇదేవిధంగా చేయాలని నమూనా తీసుకుంటున్నట్లు తెలిపారు.
 
న్యాయవాదులు స్వాతంత్య్ర సమరయోధుల వారసులని పేర్కొంటూ  దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మగాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్‌లతో పాటు వేలాది మంది న్యాయవాదులు ఉద్యమించారని, తెలంగాణలోనూ నిజాంపాలనపై ఎంతోమంది న్యాయవాదులు తమ ఆప్తులు త్యజించి ఉద్యమించి త్యాగాలు చేశారని గుర్తు చేశారు. 
 
అయితే,  స్వాతంత్య్రం అనంతరం న్యాయవాదులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని కేవలం కోర్టులకే పరిమితమవుతున్నారని పేర్కొన్నారు. న్యాయవాదులు సమాజంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, సమాజాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.