తమిళనాడులోని కూనురు వద్ద జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ జనరల్ రావత్‌తో పాటు మొత్తం 14 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చాలా నిష్పక్షపాతంగా జరుగుతున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ తెలిపారు.
హైదరాబాద్‌లోని దుండిగల్ వైమానిక దళ అకాడమీలో ఇవాళ జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ సీడీఎస్ రావత్ దంపతులు, మరో 12 మంది రక్షణదళ సిబ్బంది మృతి పట్ల ఆయన నివాళి అర్పించారు. సీడీఎస్ రావత్ మృతి కేసులో కోర్ట్ ఆఫ్ దర్యాప్తు చాలా నిస్పక్షపాతంగా జరుగుతోందని హామీ ఇచ్చారు.
అయితే ఇప్పుడు ఆ దర్యాప్తుకు చెందిన అంశాలను వెల్లడించలేనని పేర్కొన్నారు. ప్రతి చిన్న కోణాన్ని కూడా పరిశీలించాల్సి వస్తోందని చెప్పారు. హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి దారి తీసిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు ఎయిర్ చీఫ్ వీఆర్ చౌదరీ తెలిపారు.
ఎక్కడ, ఎటువంటి పొరబాటు జరిగిందన్నది తేల్చి స్పష్టమైన నివేదిక ఇవ్వాల్సి ఉందని ఎయిర్‌ఫోర్స్ చీఫ్ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చాలా నిష్పాక్షికంగా జరుగుతోందని తాను నమ్మకంగా చెప్పగలనని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో వీవీఐపీ ప్రయాణాలకు సంబంధించిన ప్రొటోకాల్‌ను రివ్యూ చేసి, మార్పులు చేర్పులు చేస్తామని ఆయన చెప్పారు. పాక్, చైనాల నుంచి ఉన్న ముప్పుపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ గౌరవ వందనం స్వీకరించారు. సంపన్నమైన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మీలాంటి చురుకైన క్యాడెట్లు అవసరమని ఆయన తెలిపారు. “మీరు ప్రదర్శిస్తున్న అత్యున్నత ప్రమాణాలు.. భవిష్యత్తులో ప్రభావంతమైన ఆపరేషన్లు చేపట్టేందుకు మూలంగా నిలుస్తుంది” అని చెప్పారు.
సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతపై మాట్లాడుతూ ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోందన్నారు. కొన్ని ఏరియాల్లో బలగాల ఉపసంహరణలు పూర్తయినప్పటికీ లఢఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్టాండాఫ్ కొనసాగుతోందని చెప్పారు. చైనా సరిహద్దులో ఎయిర్‌ఫోర్స్ మోహరింపు అవసరమైనంత కాలం అలానే ఉంటుందని వివేక్ రామ్ చెప్పారు.
చైనాతో ఎటువంటి సవాళ్లు ఎదురైనా పూర్తి సంసిద్ధతతో ఉన్నామని తెలిపారు. మరోవైపు రాఫెల్ యుద్ధ విమానాల డెలివరీని సరైన సమయంలో చేస్తున్నందుకు ఫ్రాన్స్‌కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు మనం ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్నామని, ఇప్పటికే 32 భారత్‌కు వచ్చేశాయని అన్నారు. మిగిలిన నాలుగు రాఫెల్స్‌లో మూడు ఫిబ్రవరిలో వచ్చేస్తాయని తెలిపారు.
More Stories
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు
సోషల్ మీడియా పాత్రపై విద్యా భారతి సమాలోచనలు
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన