అమెరికాలోని 30 రాష్ట్రాల్లో వ్యాపించిన ఒమిక్రాన్‌

అమెరికాలో ఓమిక్రాన్ వేరియంట్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. సుమారు 30 రాష్ట్రాల్లో ఆ వేరియంట్ కేసుల‌ను గుర్తించారు. ఇక అమెరికాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియ‌న్లు దాటిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ తెలిపింది. 

ఒమిక్రాన్ ఆందోళ‌న‌క‌ర‌మైన వేరియంట్ అని ఇటీవ‌ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఇక బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ తొలి మ‌ర‌ణం న‌మోదు అయిన‌ట్లు ఆ దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ వెల్ల‌డించారు. చాలా వేగంగా ఒమిక్రాన్ విస్త‌రిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉన్నాయి.

కాగా, కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనే ఎక్కువగా ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అమెరికా వెల్లడించింది. ఇప్పటి వరకూ అమెరికాలో మొత్తం 43 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ సోకిన ప్రజల్లో అధికభాగం.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారేనని యూఎస్‌ సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తెలియజేసింది.

ఒమిక్రాన్ సోకిన 40 మందిలో 30 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారున్నట్లు సీడీసీ గుర్తించింది. అంతేకాదు ఒమిక్రాన్ సోకిన పేషెంట్లలో 14 మంది బూస్టర్‌ డోసు కూడా తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, సౌతాఫ్రికా సైంటిస్టులు తొలిగా ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించి ప్రపంచాన్ని హెచ్చరించారు. ఆ తర్వాత ఈ వేరియంట్ చాలా దేశాలకు వ్యాపించింది.

క‌రోనా వైర‌స్ వ‌ల్ల అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 8 ల‌క్ష‌లు దాటింది. మ‌హ‌మ్మారి క‌రోనా వ‌ల్ల అత్య‌ధిక స్థాయిలో మ‌ర‌ణాలు సంభ‌వించింది అమెరికాలోనే. ఇక సోమ‌వారం నాటికి క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆ దేశంలో 50 మిలియ‌న్ల‌కు చేరుకున్న‌ది. వ్యాక్సిన్ వేసుకోనివారిలో, వృద్ధుల్లో ఎక్కువ శాతం మ‌ర‌ణాలు న‌మోదు అయిన‌ట్లు తెల‌స్తోంది.

గ‌త ఏడాది క‌న్నా ఈ ఏడాదే ఎక్కువ మంది అమెరిక‌న్లు మృతిచెందిన‌ట్లు డేటా చెబుతోంది. ఇంకా ఇప్ప‌టికి కూడా ఆ దేశంలో క‌రోనా మర‌ణాల రేటు అధికంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌డిచిన 11 వారాల్లోనే ల‌క్ష మందికిపైగా క‌రోనా వ‌ల్ల ప్రాణాలను కోల్పోయారు. ఇది గ‌త ఏడాది వింట‌ర్ సీజ‌న్‌తో పోలిస్తే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. 650 రోజుల క్రితం అమెరికాలో తొలి కోవిడ్ మ‌ర‌ణం న‌మోదు అయిన‌ట్లు అధికారులు చెప్పారు.

ఇలా ఉండగా, క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 77 దేశాల్లో ఆ వేరియంట్‌కు చెందిన కేసులు న‌మోదు అయిన‌ట్లు చెప్పింది. మీడియాతో మాట్లాడిన డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధ‌న‌మ్ గెబ్రియాసిస్ ఈ విష‌యాన్ని తెలిపారు. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించే పనిలో ఉన్న‌ట్లు చెప్పారు.

ఒమిక్రాన్ వేరియంట్‌ను అదుపు చేసేందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేక‌పోతున్నార‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వైర‌స్‌ను అంచ‌నా వేయ‌డంలో విఫ‌లం అయ్యామ‌ని, ఒమిక్రాన్ వ‌ల్ల స్వ‌ల్ప తీవ్ర‌త ఉన్న వ్యాధి సోకినా, దాంతో ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై మ‌ళ్లీ ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.