యువతలో నైతికత, దేశభక్తిని సినిమాలు పెంపొందించాలి

సినిమా రంగం లక్ష్యం వినోదం మాత్రమే కారాదని, యువతలో నీతి, నైతికవర్తన, దేశభక్తి, మానవత్వాన్ని పెంపొందించేలా సినిమాలు తీయాలని చిత్ర నిర్మాతలకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఓ ఉన్నత లక్ష్యంతో సినిమాలు నిర్మించడం ద్వారా యువతను చైతన్యవంతం చేయాలని ఉద్ఘాటించారు. 

సినిమా ద్వారా కులతత్వం, అవినీతి, లింగ వివక్ష, సామాజిక వివక్ష వంటి దురాచారాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రసిద్ధ దర్శకుడు రాహుల్ రావైల్ రచించిన ‘రాజ్ కపూర్-ది మాస్టర్ ఎట్ వర్క్’ పుస్తకాన్ని మంగళవారం న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. 

భారతీయ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారని పేర్కొన్న ఉపరాష్ట్రపతి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను సినిమా తమ మూలాలతో కలుపుతున్నదని, ఈ దిశగా సాంస్కృతిక వారధిని నిర్మిస్తున్నదని తెలిపారు.హిందీ చిత్ర సినిమా ఘనతను సగర్వంగా చాటిచెప్పిన రాజ్ కపూర్ జీవితానికి సంబంధించిన అద్భుతమైన జ్ఞాపకాలతో పుస్తకాన్ని తీసుకొచ్చిన రాహుల్ రావైల్, శ్రీమతి ప్రణికా శర్మ అభినందనీయులని ఆయన పేర్కొన్నారు. 

రాజ్ కపూర్ దూరదృష్టి గల మేధావి అని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రాజ్‌ కపూర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. రాజ్ కపూర్ తన చిత్రాల ద్వారా భారతీయ సినిమాను సాంస్కృతిక దౌత్యానికి వాహకంగా మారారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు రణ్‌బీర్ కపూర్, కాలమిస్ట్ సుహేల్ సేథ్, బ్లూమ్స్ బరీ ఇండియాకు చెందిన శ్రీమతి మీనాక్షి సింగ్ తదితరులు పాల్గొన్నారు.