క‌రీనా కపూర్‌, అమృతా అరోరాలకు క‌రోనా

బాలీవుడ్ న‌టులు క‌రీనా క‌పూర్ ఖాన్‌, అమృతా అరోరాకు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. కరోనా ప‌రీక్ష‌లో వాళ్లు పాజిటివ్‌గా తేలారు. ఇద్ద‌రూ కరోనా ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన‌ట్లు బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తెలిపింది. 

ఆ ఇద్ద‌రూ ప‌లు పార్టీల‌కు హాజ‌ర‌య్యారు. ఈ ఇద్ద‌రు న‌టుల‌తో కాంటాక్ట్‌లోకి వ‌చ్చిన వాళ్లంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని బీఎంసీ సూచించింది. అంద‌రూ ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కోరింది. అయితే క‌రీనా, అమృతాకు సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అవునా కాదా అన్న విష‌యం ఇంకా తెలియ‌దు.

కాగా,  ఇప్పటి వరకూ దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో అధిక భాగం మహారాష్ట్రలోనే వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఇక్కడ తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈమేరకు సోమవారం నాడు ఒక ప్రకటన చేశారు. తాజా కేసులతో మహారాష్ట్రలో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది.

41కు చేరిన ఒమిక్రాన్ కేసులు
 
భారత్ లో కొత్తగా మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో రెండు, గుజరాత్ రాష్ట్రంలో ఒక కేసు నమోదు అయ్యాయి. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 20కు చేరింది. గుజరాత్ రాష్ట్రంలో నాలుగుకు చేరింది.
 
ఓ వ్యాపారి డిసెంబరు 3వతేదీన దక్షిణాఫ్రికా నుంచి కెన్యా, అబుదాబీ దేశాల మీదుగా సూరత్ నగరానికి వచ్చారు. 42 ఏళ్ల సూరత్ వచ్చిన వ్యాపారికి కొత్త వేరియంట్ సోకింది. గతంలో జింబాబ్వే నుంచి గుజరాత్ రాష్ట్రంలోని జాంనగర్ నగరానికి వచ్చిన 72 ఏళ్ల ప్రవాస భారతీయుడితోపాటు అతని భార్య, బావమరిదికి ఒమైక్రాన్ వేరియెంట్ సోకింది. 
 
దక్షిణాఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యాపారికి ఒమైక్రాన్ సోకడంతో సూరత్ నగరంలో కలకలం ఏర్పడింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 41కు చేరాయి. రాజస్థాన్ లో 9, గుజరాత్ లో 4, మహారాష్ట్రలో 20, కర్నాటక 3, కేరళ 1,ఆంధ్రప్రదేశ్ లో 1, ఢిల్లీలో2, చండీగఢ్ లో ఒక ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యాయి.