
వంట నూనె ధరలు గత నెల రోజుల్లో కిలో రూ. 8–10 వరకు తగ్గాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్‌ఈఏ) ప్రకటించింది. ముఖ్యంగా దిగుమతి సుంకం తగ్గడంతోనే రేట్లు దిగొచ్చాయని పేర్కొంది. మరోవైపు దేశంలో నూనెగింజల ఉత్పత్తి పెరగడం, గ్లోబల్‌గా వంటనూనె ధరలు తగ్గుతుండడంతో రానున్న నెలల్లో వీటి రేట్లు కేజీపై మరో రూ. 3–4 తగ్గుతాయని ఎస్‌ఈఏ అంచనావేసింది.
పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని వంట నూనె ధరలను తగ్గించాలని దీపావళి ముందు అసోషియేషన్‌లోని కంపెనీలను కోరామని ఎస్‌ఈఏ గుర్తుచేసింది. ఈ చర్యలన్నీ కలిసి రావడంతో గత నెల రోజుల్లో వంట నూనెల ధరలు కిలో రూ. 8–10 తగ్గాయని ఎస్‌ఈఏ అధ్యక్షుడు అతుల్ చతుర్వేది తెలిపారు.
ఈ సారి దేశంలో సోయాబీన్ పంట విస్తీర్ణం 120 లక్షల టన్నులకు పెరిగిందని, వేరుశెనగ పంట విస్తీర్ణం అదనంగా 80 లక్షల టన్నులకు చేరుకుందని చతుర్వేది చెప్పారు. ఆవాల ధరలు దిగొస్తాయని, ఈ సారి 77.62 లక్షల హెక్టార్లలో ఈ పంట వేశారని చెప్పారు.
ఇది సాధారణం కంటే 30 శాతం ఎక్కువని, దీంతో రానున్న నెలల్లో ఆవ నూనె తయారీ 8–10 లక్షల టన్నులు పెరగొచ్చని అంచనా వేశారు. అంతర్జాతీయంగా వంటనూనె ధరలు దిగొస్తున్నాయని చతుర్వేది తెలిపారు.
కాగా, ప్రస్తుతం మనం ఉపయోగించే వంటనూనెలో 65 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇది 13–15 మిలియన్ టన్నులకు సమానం. గత రెండు మార్కెటింగ్ ఇయర్స్లో వంటనూనెల దిగుమతులు 13 మిలియన్ టన్నులకు తగ్గాయి.
More Stories
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!