ప్రపంచం మారినా చెక్కుచెదరని భారత్ – రష్యాల బంధం 

ఇరు దేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లు సోమవారం చర్చలు జరిపారు. భారత్‌-రష్యా 21వ వార్షిక సదస్సు సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.  2019 లో బ్రిక్స్ స‌మావేశం త‌రువాత వీరిద్ద‌రూ ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకోవ‌డం ఇదే ప్ర‌థ‌మం

కరోనా  మహమ్మారి వున్నా ఇరు దేశాల మధ్య సంబంధాల క్రమంలో ఎలాంటి మార్పు రాలేదని మోదీ స్పష్టం చేశారు. పైగా ప్రత్యేకమైన, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిపై, ఇంకా ఇతర అనేక అంశాలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటునే వున్నామని చెప్పారు. 

గత కొన్ని దశాబ్దాలుగా, ప్రపంచంలో అనేక ప్రాధమిక మార్పులు చోటు చేసుకున్నాయి. విభిన్న రకాల భౌగోళిక, రాజకీయ సమీకరణలు మారుతూవచ్చాయి. కానీ, భారత్‌, రష్యాల మధ్య మైత్రీబంధం అనేది చెక్కుచెదరకుండా అలాగే నిలిచిందని మోదీ  పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాల పట్ల మీకు గల నిబద్ధతే మీ పర్యటనలో ప్రతిఫలిస్తోందని మోదీ పుతిన్‌తో వ్యాఖ్యానించారు.

ఇరు దేశాల మధ్య బలమైన స్నేహబంధాన్ని కొనసాగించడంలో ప్రపంచానికి   ఆదర్శమని పేర్కొన్నారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కూడా భార‌త్ దౌత్య వ్య‌వ‌హారాల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు. భార‌త్ ఓ సూప‌ర్ ప‌వ‌ర్ దేశ‌మ‌ని తాము బ‌లంగా విశ్వ‌సిస్తామ‌ని పుతిన్ స్ప‌ష్టం చేశారు. అంత‌ర్జాతీయ య‌న‌విక‌పై ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా, వాట‌న్నింటికీ ఎదురొడ్డి ఇరు దేశాల స్నేహం కొన‌సాగింద‌ని పుతిన్ కితాబునిచ్చారు. 

యేటికేడాది ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు పురోభివృద్ధిలోనే సాగుతున్నాయని, భ‌విష్య‌త్తులోనూ ఇలాగే కొన‌సాగుతాయ‌న్న విశ్వాసాన్ని ర‌ష్యా అధ్య‌క్షుడు ప్ర‌క‌టించారు. తాము భారతదేశాన్ని గొప్ప శక్తిగా, స్నేహపూర్వక దేశంగా, మిత్రదేశంగా భావిస్తున్నామని  తెలిపారు.

అంతకుముందు వ్యూహాత్మకంగా కీలకమైన అంశాలపై చర్చల పరిధిని పెంచే ఉద్దేశ్యంతో ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు సమావేశమై చర్చలు జరిపారు. ఈ సదస్సు కోసం పుతిన్‌ భారత్‌ విచ్చేశారు. తొలుత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యా రక్షణమంత్రి సెర్గి షోయుగుతో నేటి ఉదయం భేటీ అయ్యారు. మరోవైపు విదేశాంగ మంత్రి జై శంకర్‌, రష్యన్‌ విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్‌తో సమావేశమయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో ఎకో203 అసాల్ట్‌ రైఫిల్స్‌ను ఆరు లక్షలకు పైగా సంయుక్తంగా ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదిరింది. రక్షణ మంత్రుల సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మరో పదేళ్ళపాటు సైనిక సహకారాన్ని కొనసాగించేందుకు మరో ఒప్పందం కుదిరింది. దాదాపు రూ.5వేల కోట్ల వ్యయంతో భారత సాయుధ బలగాలకు ఈ రైఫిల్స్‌ తయారుచేస్తున్నారు.

భారత్‌, రష్యా మధ్య భాగస్వామ్యం ప్రత్యేకమైనది 

భారత్‌, రష్యా మధ్య భాగస్వామ్యం చాలా ప్రత్యేకమైనదని విదేశాంగ మంత్రి జై శంకర్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో చాలా వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ మార్పుల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం చాలా నిలకడగా, బలంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్‌తో జరిగిన ద్వైపాక్ష చర్చల్లో జై శంకర్‌ పై వ్యాఖ్యలు చేశారు. భారత ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు గానూ ఆదివారం రాత్రి లావ్‌రోవ్‌, రష్యా రక్షణ మంత్రి జనరల్‌ సెర్గి షోయిగు ఢిల్లీ చేరుకున్నారు. ఆ సమావేశానికి ముందుగా జైశంకర్‌, లావ్‌రోవ్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

ప్రస్తుతం మన ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం పట్ల మనం చాలా సంతృప్తిగా వున్నామని జై శంకర్‌ తెలిపారు. మనందరికీ ఏడాదికోసారి జరిగే భారత్‌-రష్యా సదస్సు చాలా ప్రత్యేకమైనదని, ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్‌లు పరస్పరం విశ్వసనీయమైన సంబంధాలను పంచుకుంటున్నారని జైశంకర్‌ పేర్కొన్నారు.

కరోనా  కారణంగా రెండేళ్ల విరామం అనంతరం ఈ వార్షిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పలు కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించుకుంటూ ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.