ఉత్తరాంధ్రకు తప్పిన జవాద్‌ ముప్పు

ఉత్తరాంధ్ర జిల్లాలకు జవాద్‌ తుఫాన్‌ ముప్పు తప్పింది. తుఫాన్‌ బలహీనపడి శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. తాజా పరిస్థితుల ప్రకారం తుపాను ఒడిషావైపు మళ్లడంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ ముప్పు తప్పినట్టేనని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 
 
జవాద్‌ తుఫాన్‌ శుక్రవారం రాత్రి వరకు వడివడిగా తీరం దిశగా పయనించింది. విశాఖపట్నానికి 180 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా, గోపాల్‌పూర్‌కు 260 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలోనే బలపడి తీవ్ర తుఫాన్‌గా మారాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు దిశ మార్చుకునే క్రమంలో బాగా నెమ్మదించింది. 
 
శనివారం తెల్లవారుజాము నుంచి బాగా నెమ్మదించి గంటకు 6కిలోమీటర్ల వేగంతో పయనించింది… ఉదయం కొన్ని గంటల పాటు స్థిరంగా ఉండిపోయింది. ఈ సమయంలో తుఫాన్‌ పరిసరాలకు ఏడెనిమిది కిలోమీటర్లపైన గాలులు పలు దిశల్లో పయనించడం, ఉత్తరాది నుంచి చలిగాలులతో బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గాయి. 
 
దీంతో తుఫాన్‌ పైనున్న మేఘాలు ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించాయి. వీటి ప్రభావంతో తుఫాన్‌ బలహీనపడిందని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో జావద్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఒడిషాలోని గంజాం, ఖుద్రా, కెండ్రపర, జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముందస్తు చర్యగా పూరీ బీచ్‌లో ప్రజలను ఖాళీ చేయించారు.  కొల్‌కతా, దక్షిణ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లోనూ ఆదివారం వర్షాలు ముంచెత్తాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇందుకోసం 115 బహుళ ప్రయోజన శిబిరాలను, మరో 135 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల నుంచి 17,900 మంది ప్రజలను శిబిరాలకు తరలించామని ఎన్‌డిఆర్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు.  ‘జవాద్‌’ కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్నందున కొల్‌కతా, దిగా, మందర్మని బక్కాహలి, ఫ్రజీర్‌గంజ్‌, ఇతర తీర ప్రాంతాలకు పర్యాటకులు ఎవరూ రావద్దని అధికారులు హెచ్చరించారు. హూగ్లీ నదిలో పడవల రాకపోకలను నిలిపివేశారు.